Mint Sharbat: కేవలం 2 నిమిషాల్లో తయారయ్యే సూపర్ హెల్తీ డ్రింక్.. సింపుల్‌గా మీ ఇంట్లో ఇలా చేసేయండి!

Pudina Sharbat

Pudina Sharbat

Mint Sharbat: బయట ఎండలు మండిపోతున్నాయి. ఎక్కడికైనా వెళ్తే చాలు ఎండ తీవ్రత, చెమట కారణంగా శరీరం త్వరగా అలసిపోతుంది. శరీరంలో నీటి శాతం తగ్గి నీరసం, అలసట ఆవహిస్తాయి. ఇలాంటి సమయంలో మార్కెట్లో దొరికే కృత్రిమ పానీయాల కంటే, ఇంట్లోనే సహజసిద్ధంగా చేసుకునే పుదీనా షర్బత్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది కేవలం చలవ చేయడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరిచి మీకు తక్షణ శక్తిని అందిస్తుంది. ఈ ఎనర్జీ డ్రింక్‌ను సింపుల్‌గా మీ ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పుదీనా షర్బత్‌కు కావాల్సిన పదార్థాలు:
తాజా పుదీనా ఆకులు: ఒక కప్పు

నిమ్మరసం: ఒక నిమ్మకాయది

చక్కెర: 2-3 స్పూన్లు (రుచికి తగినంత)

చల్లని నీరు: ఒక గ్లాసు

నల్ల ఉప్పు (Black Salt): చిటికెడు

ఐస్ ముక్కలు: తగినన్ని

తయారీ విధానం:
ముందుగా పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్‌లో పుదీనా ఆకులు, చక్కెర, కొద్దిగా నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి తీసుకుని, అందులో నిమ్మరసం, చిటికెడు నల్ల ఉప్పు, చల్లని నీరు పోసి బాగా కలపాలి. లాస్ట్‌లో ఐస్ ముక్కలు వేసుకుంటే చల్లచల్లని పుదీనా షర్బత్ రెడీ అవుతుంది.

పుదీనా షర్బత్‌తో ప్రయోజనాలు..
ఇది శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుస్తుంది. అలాగే పుదీనాలోని యాంటీ ఆక్సిడెంట్స్ గ్యాస్, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. నిమ్మరసం, పుదీనా కలిపి తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది. అలసటను తగ్గిస్తుంది. రోజూ ఒక గ్లాసు ఈ షర్బత్ తాగితే రోజంతా ఎనర్జిటిక్‌గా, ఉత్సాహంగా ఉండవచ్చు. ఈ ఎనర్జీ డ్రింక్‌ను మధ్యాహ్నం ఎండలో బయట నుంచి వచ్చినప్పుడు లేదా భోజనం చేసిన తర్వాత తాగడం ఉత్తమం. మీకు ఎసిడిటీ సమస్య ఉంటే, పరగడుపున కాకుండా ఏదైనా తిన్న తర్వాత తీసుకోవడం మంచిది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండి, తక్కువ ఖర్చుతో, రెండు నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్దీ డ్రింక్‌ను ఇప్పుడే మీ డైట్‌లో భాగం చేసుకోండి మరి.