Healthy Breakfast: చలికాలం వచ్చిందంటే చాలు, ఉదయాన్నే పొగలు కక్కే టీతో పాటు ఏదైనా వేడివేడిగా, ఆరోగ్యానికి మేలు చేసే టిఫిన్ తినాలనిపిస్తుంది. కానీ రోజూ తినే ఉప్మా, అటుకులు (పోహా), సాదా పరాటాలతో ఇంట్లో వాళ్లందరికీ బోర్ కొట్టేస్తుంటుంది. అలాంటప్పుడు కేవలం ఈ సీజన్లో మాత్రమే దొరికే పోషకాల గని ‘బతువా ఆకుకూర’ తో అదిరిపోయే పూరీలు చేసి చూడండి. బయట కరకరలాడుతూ, లోపల ఎంతో మెత్తగా ఉండే ఈ బతువా పూరీలు శీతాకాలంలో ఆరోగ్యానికి ఎంతో మంచిది. పైగా వీటిని కేవలం 10 నిమిషాల్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
* తాజా బతువా ఆకులు: 1 కప్పు (శుభ్రంగా కడిగినవి)
* గోధుమ పిండి: 2 కప్పులు
* బొంబాయి రవ్వ లేదా శనగపిండి: 2 టేబుల్ స్పూన్లు (పూరీలు కరకరలాడటానికి)
* వాము: అర టీస్పూన్
* కారం పొడి (లేదా దంచిన పచ్చిమిర్చి): అర టీస్పూన్
* ఇంగువ: చిటికెడు
* ఉప్పు: రుచికి సరిపడా
* నూనె లేదా నెయ్యి: పిండి కలపడానికి, వేయించడానికి
తయారీ విధానం:
ముందుగా బాగా కడిగిన బతువా ఆకులను ఒక నిమిషం పాటు మరుగుతున్న నీటిలో వేసి ఉడికించండి. తర్వాత వాటిని బయటకు తీసి చల్లటి నీటిలో వేయాలి. ఆ తర్వాత మిక్సీలో వేసి మెత్తని గుజ్జులా గ్రైండ్ చేసుకోవాలి. ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో గోధుమ పిండి, బొంబాయి రవ్వ (లేదా శనగపిండి), వాము, ఇంగువ, కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీస్పూన్ నూనె వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న బతువా గుజ్జు వేసి గట్టిగా పూరీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండి ముద్దను 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
10 నిమిషాల తర్వాత పిండి నుండి చిన్న చిన్న ఉండలు తీసుకుని, కొద్దిగా నూనె రాస్తూ గుండ్రంగా, మధ్యస్థ మందంతో పూరీలుగా ఒత్తుకోవాలి. తర్వాత బాణలిలో నూనె వేడి చేసి, మీడియం-హై ఫ్లేమ్ మీద ఒక్కొక్క పూరీని వేస్తూ గరిటెతో తేలికగా నొక్కుతూ వేయించండి. రెండు వైపులా బంగారు రంగులోకి మారి, కరకరలాడేంత వరకు వేయించి తీసేయాలి. అంతే.. ఎంతో ఆరోగ్యకరమైన, కరకరలాడే బతువా పూరీలు సిద్ధం. చల్లని శీతాకాలపు ఉదయాన వీటిని ఆలూ కూర, ఏదైనా పచ్చడి లేదా వేడివేడి టీతో వడ్డిస్తే ఇంట్లో వాళ్లంతా ఎంతో ఇష్టంగా తింటారు.

