పండ్లు ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. వివిధ రకాల పండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఒక్కొరకం ఫ్రూట్స్ ఒక్కో రకం బెనిఫిట్స్ ను అందిస్తాయి. నిత్యం ఏదో ఒక రకమైన ఫ్రూట్స్ ను తీసుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యానికి ఢోకా ఉండదు. పండ్లల్లో అనేక రకాల పోషకాలు, ఫైబర్, సహజ చక్కెరలు ఉంటాయి. అందుకే ఫ్రూట్స్ ను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు వైద్యులు. మరి మీరు కూడా మెరుగైన ఆరోగ్యం కోసం పైనాపిల్ ఫ్రూట్ ను తినడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇందులో శరీరానికి అవసరమయ్యే బోలెడన్నీ పోషకాలున్నాయంటున్నారు నిపుణులు.
పైనాపిల్.. మార్కెట్ లో మనకు విరివిరిగా దొరికే ఫ్రూట్. కానీ చాలా మంది దీన్ని చూసీచూడనట్లుగా వదిలేస్తుంటారు. తక్కువ మంది మాత్రమే దీన్ని తింటుంటారు. ఎందుకంటే ఈ ఫ్రూట్ కట్ చేయడానికి కాస్త కష్టంగా ఉంటుంది. అంతేకాదు రుచిలో కాస్త పుల్ల పుల్లగా.. తియ్య తియ్యగా ఉంటుంది. చిన్న చిన్న పీసులుగా చేసుకుని తింటుంటారు. జ్యూస్ లు, ఫ్రూట్ సలాడ్స్ చేసుకుని తాగేస్తుంటారు. పైనాపిల్‌లో ప్రొటీన్, కాల్షియం, పాస్పరస్, ఐరన్, సోడియం, పొటాషియం, మాంగనీస్, కెరోటిన్, విటమిన్ సీ, ఏ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుతం రోజురోజుకు ఊబయకాయులు ఎక్కువ అవుతున్నారు.
మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలి, శారీరక శ్రమ తగ్గిపోవడంతో.. బరువు పెరుగుతున్నారు. అయితే బరువు తగ్గడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. రకరకాల ఎక్సర్ సైజ్ లు చేస్తుంటారు. వాటితో పాటుగా పైనాపిల్ ను డైట్ లో భాగం చేసుకుంటే బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. పైనాపిల్ బరువును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందని పలు అధ్యయనాల్లో కూడా ఈ విషయం స్పష్టమైంది. ప్రతీ రోజు ఒక కప్పు పైనాపిల్ ముక్కలను తినడం ద్వారా శరీరానికి కావాల్సినంత విటమిన్ సి లభిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచడంలో పైనాపిల్ ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలను త్వరగా వృద్ధాప్యంలోకి రాకుండా చూస్తాయి. రోజూ పైనాపిల్ తింటే క్యాన్సర్, గుండె జబ్బులు మీ దరికి చేరవని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం, అజీర్ణం లాంటి సమస్యలకు పైనాపిల్ దివ్య ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఒక కప్పు పైనాపిల్ ముక్కల్లో మన బాడీకి కావాల్సినంత మాంగనీస్ దొరుకుతుంది. ఇందులోని యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణం ఆస్తమాను అదుపు చేయడానికి తోడ్పడుతుంది.