Heat Stroke Warning Signs: మార్చి నెలలోనే ఎండలు దంచికొడుతున్నాయి.. బయటకు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి దాపురించింది.. అయితే, ఎండైనా.. వాన అయినా.. బయటకు వెళ్లాల్సిన వాళ్లు చాలా మందే ఉంటారు.. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ వడ దెబ్బ మరియు ఎండదెబ్బ అలసట వంటి వేడి సంబంధిత అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా మంది వడదెబ్బను సాధారణ అలసటగా తీసుకుంటారు. కానీ ప్రారంభంలోనే సంకేతాలను గుర్తించినా.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయానికి దారితీసే ప్రమాదం కూడా ఉంది..
* వేడి వల్ల శరీరంపై ప్రభావం ఎలా ఉంటుంది?
మన శరీరం చెమట ద్వారా ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అయితే అధిక వేడి, నీటి లోపం వల్ల ఈ వ్యవస్థ పనిచేయకపోతే Dehydration, వడ దెబ్బ, అలసట వంటి సమస్యలు వస్తాయి.
* వడ అలసట (Heat Exhaustion) లక్షణాలు:
– అధిక చెమట
– చల్లగా, తడిగా ఉన్న చర్మం
– బలహీనత, అలసట
– తలనొప్పి
– తల తిరగడం
– వికారం, వాంతులు
– కండరాల నొప్పులు
ఈ లక్షణాలు ఉన్నట్టు అయితే.. ఈ దశలో వెంటనే విశ్రాంతి తీసుకుని, నీరు లేదా ఎలక్ట్రోలైట్ ద్రవాలు తాగితే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది..
* వడ దెబ్బ (Heat Stroke) అంటే ఏమిటి?
వడదెబ్బ అనేది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. శరీర ఉష్ణోగ్రత 40°C కంటే ఎక్కువగా పెరిగి, మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది.
* వడ దెబ్బ ప్రారంభ లక్షణాలు:
– నిరంతర తలనొప్పి
– తీవ్రమైన దాహం, నోరు పొడిబారడం
– చెమట తగ్గడం లేదా ఆగిపోవడం
– గందరగోళం, చిరాకు
– తల తిరగడం
– వికారం
– కండరాల తిమ్మిర్లు
– మీలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం అవసరం.
* వడ అలసట vs వడ దెబ్బ – ప్రధాన తేడాలు:
శరీర ఉష్ణోగ్రత: వడ అలసటలో తక్కువగా ఉంటుంది, వడదెబ్బతో 40°C పైగా ఉంటుంది.. వడ అలసటలో మానసిక స్థితి సాధారణంగా ఉంటుంది.. కానీ, వడదెబ్బతో మానసిక స్థితి గందరగోళం ఉంటుంది
ప్రమాద స్థాయి: వడ అలసట చికిత్సతో తగ్గుతుంది, వడ దెబ్బ మాత్రం ప్రాణాపాయం కలిగించవచ్చు.. ముఖ్యంగా ఇది చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు, క్రీడాకారులు సైతం తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి..
తక్షణ సహాయం ఎలా ఇవ్వాలి?
– చల్లని లేదా నీడ ఉన్న ప్రదేశానికి తరలించాలి
– అదనపు దుస్తులు తొలగించాలి
– చల్లటి నీటి పట్టీలు వేయాలి
– వెంటనే వైద్య సహాయం పొందేలా చేయాలి..
నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
– తరచుగా నీరు తాగాలి
– మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లకూడదు (11 AM – 4 PM)
– తేలికపాటి దుస్తులు ధరించాలి
– చల్లని ప్రదేశాల్లో విరామం తీసుకోవాలి
– పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి
ముఖ్యమైన విషయం: వడ అలసటను సాధారణంగా తీసుకోవడం ప్రమాదకరం. అది వడదెబ్బకి ముందస్తు హెచ్చరిక కావచ్చు. ప్రారంభ లక్షణాలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటే ప్రాణాలను కాపాడవచ్చు. అసలే ఎండా కాలం.. ఎండలు దంచికొడుతున్నాయి.. అందుకే, ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త చర్యలు తీసుకోండి..
