Site icon NTV Telugu

Heart Attack During Pregnancy: ఈ ఏజ్‌ దాటితే.. గర్భధారణ సమయంలో గుండెపోటు.. షాకింగ్..

Heart Attack During Pregnan

Heart Attack During Pregnan

Heart Attack During Pregnancy: ఏ వయస్సులో జరగాల్సినవి.. ఆ వయస్సులోనే జరగాలని పెద్దలు చెబుతుంటారు.. ఇక, గర్భధారణ అనేది ప్రతి మహిళ జీవితంలో ఎంతో సున్నితమైన, శారీరకంగా-మానసికంగా కఠినమైన దశ. ఒకప్పుడు గర్భిణీ స్త్రీలు సాధారణంగా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి వారికి గుండెపోటు రావడం చాలా అరుదు అన్న నమ్మకం ఉండేది. కానీ తాజా వైద్య గణాంకాలు ఆ నమ్మకాన్ని పూర్తిగా తప్పుబడుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా గర్భధారణ సమయంలో గుండెపోటు మరియు ఇతర గుండె సంబంధిత సమస్యల కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గణాంకాలు ఏమి చెబుతున్నాయి?
జాతీయ మీడియా కథనం ప్రకారం, 2023 గణాంకాల ఆధారంగా భారత్‌లో ప్రతి 1 లక్ష మంది మహిళల్లో సుమారు 88 మంది గర్భధారణ లేదా ప్రసవ సమస్యల కారణంగా మరణిస్తున్నారు. వార్షికంగా ఈ సంఖ్య దాదాపు 22,500 వరకు చేరుతోంది. ప్రసవించే ప్రతి లక్ష మంది మహిళల్లో సుమారు 3 మంది తీవ్రమైన గుండెపోటు (మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్)కు గురవుతున్నారని అంచనా. సంఖ్య తక్కువగా కనిపించినా, గతంలో ఇటువంటి కేసులు దాదాపు లేనందున ఇది వైద్య నిపుణులను ఆందోళనకు గురి చేస్తోంది అదేవిధంగా, ప్రతి 100 మంది గర్భిణీ స్త్రీలలో 1 నుంచి 4 మంది వరకు గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు, అంటే ఇది ఇకపై అరుదైన సమస్య కాదు.

ఏ వయస్సు తర్వాత ప్రమాదం పెరుగుతుంది?
వైద్యుల ప్రకారం, 35 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సులో గర్భం దాల్చే మహిళల్లో గుండెపోటు ప్రమాదం స్పష్టంగా పెరుగుతుంది. వయస్సుతో పాటు మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, శారీరక చురుకుదనం లోపించడం వంటి సమస్యలు ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. అలాగే, హార్మోన్ల మార్పులు, జనన నియంత్రణ మాత్రల వాడకం, అధునాతన IVF చికిత్సలు కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి.

గర్భధారణలో గుండెపోటు ఎందుకు వస్తుంది?
గర్భధారణ సమయంలో శరీరంలో రక్త పరిమాణం దాదాపు 40 శాతం పెరుగుతుంది. పిండం అవసరాల కోసం గుండె ఎక్కువ రక్తాన్ని పంప్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల గుండెపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. అదనంగా, గర్భం అనేది రక్తం సులభంగా గడ్డకట్టే సహజ పరిస్థితి. ఇది ప్రసవ సమయంలో రక్తస్రావాన్ని తగ్గించడానికి సహాయపడినప్పటికీ, గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. గర్భిణీ స్త్రీలలో ఆకస్మిక కరోనరీ ఆర్టరీ డిసెక్షన్ (SCAD) అనే అరుదైన కానీ ప్రమాదకరమైన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ధమని గోడ అకస్మాత్తుగా చీలిపోతుంది.

లక్షణాలు ఎందుకు గుర్తించలేకపోతున్నారు?
గర్భధారణ సమయంలో గుండెపోటు లక్షణాలు సాధారణ గుండెపోటు లక్షణాల్లా ఉండవు. ఛాతీలో తీవ్రమైన నొప్పి చాలా సందర్భాల్లో కనిపించదు. బదులుగా, శ్వాస ఆడకపోవడం.. తీవ్రమైన అలసట.. వికారం, వాంతులు.. తల తిరగడం.. అధికంగా చెమటలు పట్టడం.. వీపు లేదా పైభాగంలో నొప్పి.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి గర్భధారణకు సహజమైన సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేయడం వల్ల రోగ నిర్ధారణ ఆలస్యం అవుతుంది, ఇదే అత్యంత ప్రమాదకర అంశం. అయితే.. ఇలాంటి పరిస్థితులను నిర్వహించడానికి అనుభవం ఉన్న ప్రత్యేక వైద్య బృందం అవసరం. కార్డియాలజిస్ట్, ప్రసూతి వైద్యుడు, అనస్థీషియాలజిస్ట్, నియోనాటాలజిస్ట్ కలిసి చికిత్స చేయాల్సి ఉంటుంది. అవసరమైతే కరోనరీ యాంజియోగ్రఫీ, స్టెంట్ వంటి చికిత్సలు చేయాల్సి వస్తుంది. కానీ, దేశవ్యాప్తంగా ఈ సౌకర్యాలు అన్ని చోట్ల అందుబాటులో లేకపోవడం వల్ల ప్రమాదం మరింత పెరుగుతోంది.

నివారణే ముఖ్యము
గుండె జబ్బుల ప్రమాదం ఉన్న మహిళలు గర్భధారణ ప్రారంభంలోనే గుండె పరీక్షలు చేయించుకోవడం అత్యంత అవసరం. రక్తపోటు, షుగర్ నియంత్రణ, ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక వ్యాయామం, ధూమపానం మానేయడం వంటి చర్యలు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గర్భధారణ సమయంలో లేదా ప్రసవానంతరం ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి, మూర్ఛపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి. గర్భధారణలో గుండెపోటు ఇప్పటికీ అరుదైనదే అయినా, ప్రమాదం పూర్తిగా లేదని అనుకోవడం మాత్రం పెద్ద పొరపాటు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Exit mobile version