NTV Telugu Site icon

Drug-Resistant Bacteria: షాకింగ్ స్టడీ.. ప్రాణాంతక బ్యాక్టీరియాను మోసుకొస్తున్న మేఘాలు..

Drug Resistant Bacteria

Drug Resistant Bacteria

Drug-Resistant Bacteria: ఇన్నాళ్లు గాలి ద్వారా, నీటి ద్వారా బ్యాక్టీరియా వ్యాపిస్తుందని విన్నాం. చివరకు ఇతర జీవులు, పక్షుల ద్వారా కూడా బ్యాక్టీరియా వ్యాప్తి చెందాయి. అయితే ప్రస్తుతం ఓ విషయం అందర్ని కలవరానికి గురిచేస్తోంది. ఇన్నాళ్లు మేఘాలు కేవలం వర్షాలను కురిపిస్తాయని అంతా అనుకున్నారు, కానీ ప్రస్తుతం ప్రాణాంతక బ్యాక్టీరియాను కూడా మోసుకొస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. డ్రగ్స్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాలను సుదూర ప్రాంతాల నుంచి ఈ మేఘాలు మోసుకోస్తున్నట్లు తేలింది.

కెనడా, ఫ్రెంచ్ పరిశోధకులు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ రకమైన బ్యాక్టీరియాలు సాధారణంగా వృక్షాల ఆకులపై లేదా మట్టిలో నివసిస్తాయని ఈ అధ్యయానికి సంబంధించిన ప్రధాన రచయిత ఫ్లోరెంట్ రోస్సీ శుక్రవారం తెలిపారు. ఇవి గాలి ద్వారా వాతావరణంలోకి చేరుతాయని, మేఘాల ద్వారా ఈ బ్యాక్టీరియాలు ప్రపంచవ్యాప్తంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తాయని తేలింది. దీనికి సంబంధించిన ఆవిష్కరణ సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్మెంట్ జర్నల్ లో ప్రచురితమైంది.

Read Also: Tourism Countries: టూరిస్టులు ఎక్కువగా సందర్శించే టాప్-10 దేశాలు

క్యూబెక్ సిటీలోని లావల్ యూనివర్సిటీ మరియు సెంట్రల్ ఫ్రాన్స్‌లోని క్లెర్మాంట్ ఆవెర్గ్నే యూనివర్సిటీ పరిశోధకులు క్లౌడ్ శాంపిల్స్‌లో కనిపించే బ్యాక్టీరియా నుండి యాంటీబయాటిక్-రెసిస్టెంట్ జన్యువులను కనుగొన్నారు. సెప్టెంబర్ 2019 మరియు అక్టోబర్ 2021 మధ్య ఫ్రాన్స్ లో ఉన్న నిద్రాణమైన అగ్నిపర్వతం పుయ్ డి డోమ్ శిఖరంపై సముద్రమట్టానికి 1,465 మీటర్ల ఎత్తులో ఉన్న వాతావారణ కేంద్రం నుంచి నమూనాలను సేకరించారు. ఇందులో ఒక మిల్లీలీటర్ మేఘాల నీటిలో 330 నుంచి 30,000 కంటే ఎక్కువ బ్యాక్టీరియాలు ఉన్నట్లు కనుగొన్నారు. సగటున మిల్లీలీటర్ నీటిలో 8000 బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఉన్న బ్యాక్టీరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెంట్ జన్యువులు ఉన్న 29 ఉపరకాలను గుర్తించారు.

ప్రస్తుతం ఉన్న బ్యాక్టీరియాలు క్రమంగా యాంటీబయాటిక్స్ కు మొండిగా తయారువుతున్నాయి. యాంటీ బయాటిక్స్ కూడా లొంగడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా మానవులకు సోకితే ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉంటాయి. వ్యవసాయం, వైద్యంలో విరివిగా యాంటీబయాటిక్స్ వాడుతుండటంతో కొన్నిసార్లు బ్యాక్టీరియాలు చికిత్సకు లొంగడం లేదు. యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా వాతావరణంలో వ్యాప్తి చెందడం వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాలపై అధ్యయనం ఎటువంటి నిర్ధారణలను అందించలేదు. కేవలం ఐదు శాతం నుండి 50 శాతం జీవులు మాత్రమే సజీవంగా మరియు చురుకుగా ఉండగలవని అంచనా వేసింది.

వాతావరణం బ్యాక్టీరియాకు చాలా ఒత్తిడితో కూడుకున్నది, ప్రస్తుతం పరిశోధకులు కనుగొన్న బ్యాక్టీరియా మానవులకు హాని కలిగించే అవకాశం తక్కువ అని పరిశోధకులు చెప్పారు. కాబట్టి ప్రజలు వర్షంలో నడవడానికి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కొత్తగా కనుగొన్న యాంటీ బ్యాక్టీరియల్ రిసెస్టింట్ జన్యువులు ఇతర బ్యాక్టీరియాలకు సంక్రమిస్తాయో లేదో అస్పష్టంగా ఉందిని పరిశోధకలు తెలిపారు.

Show comments