Child Stomach pain: స్కూల్‌కు వెళ్లే ముందు పిల్లలు కడుపునొప్పి అంటున్నారా..? అసలు కారణం ఇదే కావచ్చు!

Child Stomach Pain

Child Stomach Pain

Child Stomach pain: పిల్లలు స్కూల్‌కు వెళ్లే సమయం రాగానే కడుపునొప్పి, వాంతులు, టాయిలెట్‌కు వెళ్లాలనే సమస్యలతో బాధపడుతున్నారా? వారాంతాల్లో, సెలవు రోజుల్లో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటున్నారా? అయితే దీని వెనుక కేవలం శారీరక సమస్యే కాకుండా మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా కారణం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పాఠశాలలో ఎదురయ్యే సమస్యలను పిల్లలు మాటల్లో చెప్పలేక శారీరక ఇబ్బందుల రూపంలో వ్యక్తం చేసే అవకాశం ఉందని వివరిస్తున్నారు.

ఆందోళనతో కడుపునొప్పి ఎలా వస్తుంది?
పిల్లల మెదడు, జీర్ణవ్యవస్థ ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి. పిల్లలు ఏదైనా విషయంపై ఆందోళనకు గురైనప్పుడు శరీరంలో వచ్చే మార్పులు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి. దీంతో కడుపునొప్పి, వికారం, విరేచనాలు లేదా మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తవచ్చు. తమను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని ఎలా చెప్పాలో తెలియని పిల్లలు కొన్నిసార్లు కడుపునొప్పి రూపంలో తమ బాధను వ్యక్తం చేస్తారు. నవజాత శిశువులు, పిల్లల వైద్య నిపుణుల ప్రకారం.. పిల్లల్లో మానసిక ఒత్తిడి శారీరక లక్షణాల రూపంలో బయటపడవచ్చు. స్కూల్‌లో ఏదైనా సమస్య ఉందని చెప్పడం కంటే కడుపునొప్పిగా ఉందని చెప్పడం పిల్లలకు సులభంగా అనిపించవచ్చు అంటున్నారు..

స్కూల్ అంటే పిల్లలు ఎందుకు ఆందోళన చెందుతారు?
పిల్లల్లో స్కూల్‌కు సంబంధించిన ఆందోళనకు అనేక కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా చదువులో ఒత్తిడి, పరీక్షలు, హోంవర్క్, క్లాస్‌లో వెనుకబడిపోతామనే భయం పిల్లలను మానసికంగా ఇబ్బంది పెట్టవచ్చు. మంచి మార్కులు సాధించాలనే ఒత్తిడి కూడా కడుపునొప్పికి కారణమయ్యే అవకాశం ఉంది. అలాగే తోటి విద్యార్థులతో గొడవలు, స్నేహితులు దూరం పెట్టడం, ఒంటరిగా ఉండాల్సి రావడం వంటి సమస్యలు పిల్లల్లో ఆందోళన పెంచుతాయి. కొంతమంది పిల్లలు స్కూల్‌లో వేధింపులకు గురవుతున్నా తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడవచ్చు. ఇలాంటి పరిస్థితులు కూడా తరచూ కడుపునొప్పి రూపంలో బయటపడవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో తల్లిదండ్రులకు దూరంగా ఉండలేకపోవడం, స్కూల్‌కు వెళ్లేటప్పుడు ఏడవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. దీనిని సెపరేషన్ యాంగ్జైటీ అంటారు. కొత్త ఇల్లు, కొత్త స్కూల్, ఉపాధ్యాయుల మార్పు, కుటుంబంలో సమస్యలు వంటి పరిణామాలు కూడా పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి.

తల్లిదండ్రులు గమనించాల్సిన లక్షణాలు
పిల్లలకు ఎప్పుడు కడుపునొప్పి వస్తోంది? ఎంతసేపు ఉంటుంది? స్కూల్‌కు వెళ్లే సమయంలోనే వస్తోందా? సెలవు రోజుల్లో తగ్గిపోతోందా? అనే విషయాలను తల్లిదండ్రులు గమనించాలి. ముఖ్యంగా ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి.
– ఎక్కువగా స్కూల్‌కు వెళ్లే ఉదయమే కడుపునొప్పి రావడం.
– వారాంతాల్లో, సెలవుల్లో నొప్పి తగ్గిపోవడం.
– స్కూల్‌కు వెళ్లడానికి నిరాకరించడం లేదా భయపడటం.
– తరచూ ఏడవడం, చిరాకు పడటం, మూడ్‌లో మార్పులు రావడం.
– నిద్ర, ఆహారపు అలవాట్లలో మార్పులు కనిపించడం.
– స్నేహితులతో మాట్లాడటానికి, ఆటల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపకపోవడం.
– స్కూల్ గురించి మాట్లాడటానికి ఇష్టపడకపోవడం.

ఈ లక్షణాలు ఎప్పుడు కనిపిస్తున్నాయో ఒక చిన్న రికార్డు నిర్వహించడం ద్వారా సమస్యకు కారణాన్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది.

పిల్లల సమస్యను తల్లిదండ్రులు ఎలా పరిష్కరించాలి?
పిల్లలు కడుపునొప్పి ఉందని చెప్పినప్పుడు తల్లిదండ్రులు ముందుగా వారి మాటలను శ్రద్ధగా వినాలి. ఇదంతా నాటకం అని, స్కూల్‌కు వెళ్లకుండా ఉండేందుకు చెబుతున్నారని కొట్టిపారేయకూడదు. పిల్లల బాధను అర్థం చేసుకుని, స్కూల్‌లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? స్నేహితులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయా? టీచర్లు ఏమైనా అంటున్నారా? వంటి విషయాలను ప్రశాంతంగా అడిగి తెలుసుకోవాలి. పిల్లలను ప్రశ్నలతో ఇబ్బంది పెట్టకుండా, తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకునే వాతావరణం కల్పించాలి. ప్రతిరోజూ సరైన సమయానికి నిద్రపోవడం, ఉదయం అల్పాహారం తీసుకోవడం, క్రమబద్ధమైన దినచర్యను పాటించడం ద్వారా ఒత్తిడిని కొంతవరకు తగ్గించవచ్చు. సమస్య స్కూల్‌లోనే ఉందని అనిపిస్తే క్లాస్ టీచర్ లేదా స్కూల్ కౌన్సెలర్‌తో మాట్లాడాలి. పిల్లలు ఎదుర్కొంటున్న పరిస్థితులను తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలి.

ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి?
తరచూ కడుపునొప్పి వస్తోందని చెప్పే పిల్లల సమస్యను కేవలం మానసిక ఒత్తిడిగా భావించకూడదు. మలబద్ధకం, ఇన్ఫెక్షన్లు, ఆహార అసహనం వంటి శారీరక సమస్యలు కూడా కడుపునొప్పికి కారణం కావచ్చు. నొప్పి పదేపదే వస్తున్నా, పిల్లల రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నా వైద్యులను సంప్రదించాలి. అవసరమైన పరీక్షల ద్వారా అసలు కారణాన్ని గుర్తించి తగిన చికిత్స అందించవచ్చు. మొత్తంగా స్కూల్‌కు వెళ్లే ముందు వచ్చే కడుపునొప్పి కొన్నిసార్లు పిల్లలు మాటల్లో చెప్పలేని మానసిక ఆందోళనకు సంకేతం కావచ్చు. అందుకే పిల్లల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా, వారి సమస్యలను అర్థం చేసుకుని అవసరమైన వైద్య సహాయం అందించడం తల్లిదండ్రుల బాధ్యత.