NTV Telugu Site icon

వెల్లుల్లి తింటే బరువు తగ్గుతారా?

మన వంటిల్లే వైద్యశాల.. పూర్వకాలంలో వంటింటి ఔషధాలతోనే అనేక వ్యాధుల్ని నయం చేసేవారు. మనకు మేలు చేసే ఔషధాల్లో వెల్లుల్లి ముఖ్యమయిందిగా చెబుతారు. వెల్లుల్లిని వంటలో రుచి కోసం వాడుతారు.. కానీ దానిలో అనేక ఔషధాలు పుష్కలంగా ఉన్నాయనేది మీకు తెలుసా. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తింటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనేది చాలామందికి తెలియదు. మీ శరీరంలో చేరే అనేక హానికారక క్రిములను వెల్లుల్లి పోగొడుతుంది. నిత్యం మీకు జలుబు, జ్వరం వస్తోందా? అయితే మీరు వెల్లుల్లిని ట్రై చేయండి.

ఫ్లూ, క్యాన్సర్ వంటి వ్యాధులను వెల్లుల్లి అరికడుతుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల మన శరీరానికి అనేక ఉపయోగాలు కలుగుతాయి. తరచూ వేధించే అనారోగ్య సమస్యలు దరిచేరవు. రోజూ లేవగానే ఉదయం ఒక గ్లాసు నీటితోపాటు వెల్లుల్లి రెబ్బను తింటే.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అనేక అజీర్ణ సమస్యలు దూరమవుతాయి. దీంతోపాటు మన శరీర బరువు కూడా తగ్గించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. రక్తం మందంగా ఉన్నవారికి వెల్లుల్లి తినడం వల్ల రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించి వచ్చు. తద్వారా గుండె సమస్యలు రాకుండా చేస్తుంది.

రక్తం గడ్డ కట్టడం లాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ రెండు రెబ్బలు వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తింటే ఈ సమస్య దూరమవుతుంది. వెల్లుల్లిలో ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కావున దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీకు అనేక రకాల ప్రయోజనాలు లభించడంతోపాటు ఆరోగ్యవంతంగా ఉండవచ్చు. వెల్లుల్లి రెబ్బల్ని వలిచి నూనెలో వేయించి తినడం వల్ల ప్రయోజనం పొందవచ్చు.

గొంతు సంబంధిత వ్యాధులు, చిన్న చిన్న పొక్కులు నిరోధించవచ్చు. వెల్లుల్లిలో విట‌మిన్ బి6, సి, ఫైబ‌ర్‌, మాంగ‌నీస్‌, కాల్షియం వంటి పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి. అందువ‌ల్ల అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. వెల్లుల్లిని 8 వారాల పాటు తీసుకుంటే శ‌రీరంలోని కొవ్వు క‌రుగుతుంద‌ని ఆయుర్వేదంలో వుంది. విదేశీ సైంటిస్టులు కూడా తమ ప‌రిశోధ‌న‌ల్లో బరువు తగ్గించే గుణం వెల్లుల్కి వుందని తేల్చిచెప్పారు. వెల్లుల్లి వల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాలు, విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోవడం వల్ల బరువు తగ్గి, హాయిగా అనిపిస్తుంది.