5 Best Salads for Glowing Skin: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు.. అందులో చర్మం ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యం.. ప్రతి ఒక్కరూ తమ చర్మం సహజంగా మెరిసిపోవాలని కోరుకుంటారు. అందుకోసం చాలామంది ఖరీదైన క్రీములు, సీరమ్‌లు, పార్లర్ ట్రీట్‌మెంట్‌లపై వేల రూపాయలు ఖర్చు చేస్తుంటారు.. ఖరీదైన క్రీములు వాడి కొత్త సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా లేకపోలేదు.. అయితే నిజానికి చర్మానికి అసలైన కాంతి బయట పూసే ఉత్పత్తుల వల్ల కాకుండా మనం తీసుకునే ఆహారం వల్ల వస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం చర్మాన్ని లోపలి నుంచి పోషించి సహజమైన మెరుపును అందిస్తుంది అంటున్నారు నిపుణులు.. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉండే సలాడ్లు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరాన్ని డిటాక్స్ చేయడంతో పాటు చర్మాన్ని తాజాగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి.
ఇప్పుడు చర్మానికి సహజమైన గ్లో ఇవ్వగల 5 అద్భుతమైన సలాడ్ల గురించి తెలుసుకుందాం.
1. బీట్‌రూట్ రేడియన్స్ సలాడ్
బీట్‌రూట్ రక్తాన్ని శుద్ధి చేసి ముఖానికి సహజమైన గులాబీ రంగు కాంతిని అందించడంలో సహాయపడుతుంది. ఈ సలాడ్ తయారు చేయడానికి అర కప్పు తురిమిన బీట్‌రూట్ తీసుకుని, అందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు, కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర కలపాలి. దీన్ని మధ్యాహ్న భోజనం లేదా సాయంత్రం స్నాక్‌గా తీసుకోవచ్చు. రోజూ తీసుకుంటే చర్మం మరింత కాంతివంతంగా కనిపిస్తుంది.
2. అవకాడో గ్లో సలాడ్
అవకాడోలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మాన్ని లోపలి నుంచి తేమగా ఉంచుతాయి. సగం అవకాడో ముక్కలను తీసుకుని అందులో చెర్రీ టమాటాలు, లెట్యూస్ వేసి కొద్దిగా ఆలివ్ ఆయిల్ చల్లాలి. ఈ సలాడ్‌ను తరచుగా తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా, మెరిసేలా మారుతుంది.
3. దోసకాయ-పుదీనా హైడ్రేషన్ సలాడ్
వేసవిలో చర్మాన్ని చల్లగా, హైడ్రేటెడ్‌గా ఉంచడం చాలా ముఖ్యం. దోసకాయ ముక్కలు, తాజా పుదీనా ఆకులు, నిమ్మరసం, కొద్దిగా నువ్వులు కలిపి ఈ సలాడ్ తయారు చేయాలి. ఇది చర్మంలోని ఉబ్బరాన్ని తగ్గించి తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది.
4. బెర్రీ యాంటీఆక్సిడెంట్ సలాడ్
స్ట్రాబెర్రీలు, బ్లాక్‌బెర్రీలు వంటి బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. మిశ్రమ బెర్రీలు, పాలకూర, వాల్‌నట్‌లు, చియా గింజలను కలిపి ఈ సలాడ్ తయారు చేయాలి. ఇది శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.
5. క్యారెట్-ఆరెంజ్ సలాడ్
క్యారెట్ మరియు ఆరెంజ్‌లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మాన్ని రిపేర్ చేసి సహజమైన కాంతిని అందిస్తుంది. తురిమిన క్యారెట్, ఆరెంజ్ ముక్కలు, ఎండుద్రాక్ష, గుమ్మడికాయ గింజలను కలిపి ఈ సలాడ్ తయారు చేయాలి. ఇది చర్మంలోని కాంతిహీనతను తగ్గించి ముఖాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.
చర్మానికి ఆహారమే అసలైన అందం
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే బయట పూసే క్రీములకంటే సరైన ఆహారం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో ఈ ఆరోగ్యకరమైన సలాడ్లను చేర్చుకోవడం ద్వారా చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది. అలాగే తగినంత నీరు తాగడం, సరైన నిద్ర, ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా చర్మ ఆరోగ్యానికి ఎంతో అవసరమని సూచిస్తున్నారు..
