Bellam Rava Laddu: నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే! 10 నిమిషాల్లో హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు’.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేయొచ్చు!

Jaggery Rava Laddu

Jaggery Rava Laddu

Bellam Rava Laddu: ఈ రోజుల్లో హెల్త్ కాన్షియస్ పెరగడంతో చాలామంది స్వీట్లకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా వైట్ షుగర్ (పంచదార) వాడకాన్ని తగ్గించాలనుకునే వారికి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం బెల్లం. ట్రెడిషనల్ స్వీట్ అయిన రవ్వ లడ్డును పంచదార లేకుండా, కేవలం బెల్లం, పచ్చి కొబ్బరి కాంబినేషన్‌తో మరింత పోషక విలువలతో తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా. పండగలకైనా లేదా అప్పటికప్పుడు నోరు తీపి చేసుకోవాలన్నా.. కేవలం 10 నిమిషాల్లో రెడీ చేసుకునే ఈ హెల్తీ రవ్వ లడ్డును సింపుల్‌గా ఇలా మీ ఇంట్లో తయారు చేసుకోండి.

కావలసిన పదార్థాలు:

బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ): 1 కప్పు

×
×
Ad

తురిమిన బెల్లం: ముప్పావు కప్పు (ముక్కలు లేకుండా చూసుకోవాలి)

పచ్చి కొబ్బరి తురుము: అర కప్పు

నెయ్యి: 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు

జీడిపప్పు, కిస్మిస్: తగినంత

యాలకుల పొడి: పావు టీస్పూన్

కాచి చల్లార్చిన పాలు: 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం ఇదే..

ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక జీడిపప్పు, కిస్మిస్ ముక్కలను వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్‌లో ఒక కప్పు బొంబాయి రవ్వను వేసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ దోరగా వేయించాలి. రవ్వ మంచి సువాసన వస్తున్నప్పుడు, అందులో అర కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి లో ఫ్లేమ్‌లో మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి. ఇలా కొబ్బరి వేయడం వల్ల లడ్డూలు ఎంతో సాఫ్ట్‌గా, కమ్మగా వస్తాయి. వేగిన రవ్వ-కొబ్బరి మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి మార్చుకోవాలి.

ఇప్పుడు అదే పాన్‌లో ముప్పావు కప్పు తురిమిన బెల్లం వేసి, కేవలం 2 టీస్పూన్ల నీళ్లు మాత్రమే పోసి మీడియం ఫ్లేమ్‌లో బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఈ రెసిపీకి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది. కరిగిన బెల్లం వేడిగా ఉన్నప్పుడే వడకట్టి రవ్వ మిశ్రమంలో పోయాలి. అందులోనే పావు టీస్పూన్ యాలకుల పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డు చుట్టడానికి వస్తుందో లేదో చూడాలి. ఒకవేళ మిశ్రమం పొడిగా అనిపిస్తే, 2-3 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలను కొద్దికొద్దిగా చల్లుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. పాలకు బదులుగా నెయ్యిని కూడా ఉపయోగించవచ్చు, నెయ్యి వేస్తే లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఈ పద్ధతిలో బెల్లంతో చేసిన రవ్వ లడ్డూలు పంచదార లడ్డూల కంటే ఎంతో రుచిగా, ఆరోగ్యకరంగా ఉంటాయి. పండగలకు, స్పెషల్ సందర్భాలలో తక్కువ సమయంలో స్వీట్ చేయాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఛాయిస్.

ఆరోగ్య ప్రయోజనాలు..

పంచదారలో ఎలాంటి పోషకాలు ఉండవు, కానీ బెల్లంలో ఐరన్ (Iron) పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడే మహిళలకు, పిల్లలకు ఈ బెల్లం రవ్వ లడ్డు ఒక మంచి హెల్తీ స్నాక్‌గా పని చేస్తుంది. బొంబాయి రవ్వలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. నీరసంగా ఉన్నప్పుడు లేదా సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ లడ్డు ఇవ్వడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే బెల్లంలో ఉండే సహజ గుణాలు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. తిన్న ఆహారం త్వరగా అరగడానికి, మలబద్ధకం సమస్యను తగ్గించడానికి బెల్లం సహాయపడుతుంది.

ఈ లడ్డులో ఉపయోగించే బెల్లం, ఎండుద్రాక్ష (కిస్మిస్), జీడిపప్పుల వల్ల శరీరానికి యాంటీఆక్సిడెంట్లు, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు అందుతాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి. లడ్డులో వేసే పచ్చి కొబ్బరి వల్ల శరీరానికి మంచి కొవ్వులు అందుతాయి. అలాగే నెయ్యి ఎముకల ఆరోగ్యానికి, కీళ్ల నొప్పులు తగ్గడానికి, చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది.