NTV Telugu Site icon

Health Tips: విటమిన్‌ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. ఇవి తింటే బెటర్..

Liposomal Vitamin C Benefits Newstamilonline 1280x720

Liposomal Vitamin C Benefits Newstamilonline 1280x720

మన ఆరోగ్యానికి విటమిన్‌ ‘సి’ తగిన మోతాదులో అందడం చాలా ముఖ్యం. ఎముకల అభివృద్ధికి, రక్త నాళాల పనితీరుకు, గాయాలు త్వరగా నయం కావడానికి..విటమిన్‌ సి అత్యవసరం. ఇది లోపిస్తే అనేక వ్యాధులు శరీరంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి.

1. స్కర్వీ

విటమిన్‌ సి లోపం వల్ల కలిగే వ్యాధి ఇది. ఆహారం ద్వారా తగినంత సి విటమిన్‌ అందనప్పుడు స్కర్వీ లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. పంటి చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం, గాయాల నుంచి రక్తం కారడం, అలసటగా అనిపించడం, దద్దుర్లు రావడం, నీరసంగా అనిపించడం వంటివన్నీ స్కర్వీ వ్యాధి లక్షణాలు.

మొదట్లో అలసటగా అనిపించడం, ఆకలి లేకపోవడం, ప్రతి దానికి చిరాకు పడడం, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

2. హైపర్‌ థైరాయిడిజం

థైరాయిడ్‌ గ్రంధి అధికంగా హార్మోన్లను స్రవించడాన్ని హైపర్‌ థైరాయిడిజం అంటారు. థైరాయిడ్‌ గ్రంధి ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్‌ సి అవసరం. లేకుంటే బరువు హఠాత్తుగా తగ్గడం, గుండె కొట్టుకోవడంతో తేడా, విపరీతమైన ఆకలి, భయం, వణుకు, మహిళల్లో రుతుక్రమంలో మార్పులు వంటి లక్షణాలు కలుగుతాయి.

3. రక్తహీనత

శరీరం ఇనుమును శోషించుకోవడానికి విటమిన్‌ సి సాయపడుతుంది. తగిన స్థాయిలో ఈ విటమిన్‌ అందకపోతే ఐరన్‌ శోషణ తగ్గి రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. దీని వల్ల బరువు తగ్గడం, ముఖం పాలిపోయినట్టు అవడం, శ్వాస ఆడకపోవడం వంటి ఆరోగ్య లక్షణాలు కనిపిస్తాయి.

4. చర్మ సమస్యలు

విటమిన్‌ సిలో యాంటీఆక్సడెంట్‌ లక్షణాలు అధికంగా ఉంటాయి. చర్మానికి బిగుతును, సాగే గుణాన్ని ఇచ్చే కొల్లాజెన్‌ ఉత్పత్తిలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల చర్మంపై దద్దుర్లు, మచ్చలు, రక్తస్రావం వంటివి కలుగుతాయి.

ఏం తినాలి?

1. విటమిన్‌ సి లోపం తలెత్తకుండా ఉండాలంటే రోజు వారీ ఆహారంలో కొన్ని రకాల పదార్థాలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి.

2. నారింజలు, నిమ్మ రసాలు తాగుతూ ఉండాలి.

3. బంగాళాదుంపలు, స్ట్రాబెర్రీలు, బ్రకోలి, క్యాప్సికమ్, బొప్పాయి, జామ, కివీలు, పైనాపిల్, టమోటాలు, పచ్చిబఠాణీలను మీ ఆహార మెనూలో చేర్చుకోవాలి.

4. విటమిన్‌ సి టాబ్లెట్లను వైద్యుల సలహా మేరకే ఉపయోగించాలి.