బెండకాయ భారతీయ వంటల్లో అత్యంత ప్రసిద్ధమైన కూరగాయ. రుచి మాత్రమే కాదు, విటమిన్-సి, విటమిన్-కె, ఫోలేట్, ఫైబర్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు నిండిన ఈ కూరగాయ ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగకరం. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అయితే, ప్రతి ఆహారం అందరికీ సరిపోకపోవచ్చు. కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి బెండకాయ హానికరం కావచ్చని డాక్టర్‌లు హెచ్చరిస్తున్నారు.
1. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు
బెండకాయ లో సహజసిద్ధంగా ఉండే ఆక్సలేట్లు (Oxalates) శరీరంలో కాల్షియం తో కలిసినప్పుడు కాల్షియం ఆక్సలేట్ రాళ్లు (Kidney Stones) ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు లేదా కుటుంబంలో ఈ సమస్య చరిత్ర ఉన్నవారు బెండకాయ తినడం వల్ల పరిస్థితి మరింత క్లిష్టం కావచ్చు. వైద్యులు చెబుతున్నట్లు, కిడ్నీ రాళ్ల సమస్య ఉన్నవారు బెండకాయను పూర్తిగా మానుకోవడం లేదా అత్యంత పరిమితంగా మాత్రమే తీసుకోవడం ఉత్తమం. ఒకవేళ తినాల్సి వస్తే.. చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే తినాలి, రోజంతా ఎక్కువ నీరు తాగాలి. రాళ్ల సమస్యకు సంబంధించి డాక్టర్ సూచించిన డైట్‌కి కట్టుబడి ఉండాలి. ఇలా చేస్తే రాళ్లు మళ్లీ పెరగకుండా లేదా ఉన్నవి మరింత తీవ్రమవకుండా కాపాడుకోవచ్చు
2. గౌట్ సమస్య ఉన్నవారు
గౌట్ (Gout) అనేది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయులు అధికమవ్వడం వల్ల కలిగే వ్యాధి. ఈ వ్యాధి ఉన్నవారిలో యూరిక్ యాసిడ్ స్ఫటికాల రూపంలో కీళ్లలో పేరుకుపోతుంది. ఫలితంగా తీవ్రమైన కీళ్ల నొప్పి, వాపు, వాపుతో కూడిన కఠినత వంటి సమస్యలు ఎదురవుతాయి. కనుక బెండకాయ లో ఉన్న ఆక్సలేట్లు (Oxalates) యూరిక్ యాసిడ్ స్ఫటికీకరణ (crystallization) ను ప్రోత్సహిస్తాయి. దీంతో గౌట్ ఉన్నవారిలో లక్షణాలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చలికాలంలో (Winter Season) గౌట్ సమస్య ఎక్కువగా ప్రభావితం అవుతుంది. అలాంటప్పుడు బెండకాయ తినడం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి.. గౌట్ ఉన్నవారు బెండకాయను పూర్తిగా నివారించడం మంచిది. ఇతర కూరగాయలతో భోజనం చేయడం ఆరోగ్యకరం. డైట్ మార్పుల కోసం వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
3. జీర్ణ సమస్యలు ఉన్నవారు
బెండకాయలో ఫైబర్ (Fiber) అధికంగా ఉంటుంది. సాధారణంగా ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇది ప్రతికూల ప్రభావం చూపవచ్చు. గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం లేదా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS) ఉన్నవారు బెండకాయ తిన్న తర్వాత మరింత ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు. అధిక ఫైబర్ కారణంగా కడుపులో వాయువు పెరగడం, ఉబ్బరం, కడుపు నొప్పి, అసౌకర్యం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి జీర్ణ సమస్యలతో బాధపడుతున్నవారు బెండకాయను ఎక్కువగా తినకూడదు. ఒకవేళ తినాలనిపిస్తే, తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే ఆహారంలో చేర్చాలి.
4. రక్తం పలుచబడే మందులు వాడేవారు
బెండకాయలో విటమిన్-కె (Vitamin K) సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడానికి సహాయపడే ముఖ్యమైన పోషక పదార్థం. సాధారణంగా ఇది శరీరానికి మంచిదే అయినా, బ్లడ్ థిన్నర్స్ (రక్తం పలుచబడే మందులు) వాడుతున్న వారికి ఇది ప్రతికూల ప్రభావం చూపవచ్చు. విటమిన్-కె అధికంగా తీసుకోవడం వల్ల బ్లడ్ థిన్నర్స్ ప్రభావం తగ్గిపోతుంది. ఫలితంగా రక్తం గడ్డకట్టే అవకాశం పెరిగి, హార్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్ వంటి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశముంది. కాబట్టి.. రక్తం పలుచబడే మందులు వాడేవారు బెండకాయను పరిమితంగా మాత్రమే తినాలి. వైద్యుల సూచన మేరకు ఆహార నియమాలు పాటించడం అవసరం
5. అలర్జీ ఉన్నవారు
కొంతమందికి బెండకాయ వల్ల అరుదుగా అలర్జీ రావచ్చు. తిన్న తర్వాత చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, నోటిలో మంట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే తినడం ఆపి వైద్యుడిని సంప్రదించాలి. నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకమైన ఎనాఫిలాక్సిస్‌కి దారితీసే అవకాశం ఉంది.
మొత్తంగా, బెండకాయ ఆరోగ్యకరమైన కూరగాయ అయినప్పటికీ, కిడ్నీ రాళ్లు, గౌట్, జీర్ణ సమస్యలు, బ్లడ్ థిన్నర్స్ వాడేవారు, అలర్జీ ఉన్నవారు జాగ్రత్త వహించాలి. అవసరమైతే డాక్టర్ సలహా తీసుకుని, పరిమితంగా తీసుకోవడం ఉత్తమం.
