Site icon NTV Telugu

Health Risks of Plastic Bottles: ప్లాస్టిక్ బాటిళ్లతో తరచూ నీళ్లు తాగుతున్నారా? జాగ్రత్త..!

Untitled Design (5)

Untitled Design (5)

ప్లాస్టిక్ సీసాల్లో నీరు తాగడం ఎంతో సాధారణమైన చర్యే అయినా, ఆరోగ్య నిపుణుల ప్రకారం ఇది మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. చాలామంది “ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు తాగితే ఏమవుతుందిలే!” అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ తాజా పరిశోధనలు దీనిని ఓ పెద్ద ఆరోగ్య హానిగా గుర్తిస్తున్నాయి.

ప్లాస్టిక్ బాటిళ్లను మళ్లీ మళ్లీ వాడడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మనలో చాలా మంది పాత ప్లాస్టిక్ బాటిళ్లను కడిగి తిరిగి వాడుతుంటారు.ఇది పూర్తిగా మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పాత సీసాలు అరిగిపోవడంతో వాటి నుంచి మైక్రోప్లాస్టిక్‌లు నీటిలోకి విడుదలవుతాయంటున్నారు.మైక్రోప్లాస్టిక్‌లు అతి చిన్న పరిమాణంలో ఉన్న ప్లాస్టిక్ కణాలు. ఇవి పాత ప్లాస్టిక్ వస్తువుల అరిగిపోవడం, దుస్తుల నుండి విడిపోయే మైక్రోఫైబర్లు, ముఖ్యంగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల కరుగుదల ద్వారా నీటి వనరుల్లోకి చేరతాయి.

ప్రస్తుతం సముద్రాలు, నదులు, నేల, గాలి — అన్నీ మైక్రోప్లాస్టిక్‌లతో కలుషితమైపోతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ పరిశోధనల్లో బాటిల్ వాటర్‌లో పెద్ద మొత్తంలో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇవి మన శరీరంలోకి వెళ్లి వాపు, ఆక్సీకరణ ఒత్తిడి,హానికర రసాయనాల బదిలీ వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ హెల్త్ కూడా ఈ సమస్యపై ఒక ముఖ్యమైన నివేదిక విడుదల చేసి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించింది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే స్టీల్ బాటిళ్లు, గాజు బాటిళ్లు, BPA-రహిత బాటిళ్లు వంటి వాటిని ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, వీలైనంత వరకు వడపోసిన లేదా శుద్ధి చేసిన నీరు మాత్రమే తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అది పర్యావరణానికి కూడా మేలు చేస్తుందన్నారు.ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా మన ఆరోగ్యమే కాకుండా, పర్యావరణాన్ని కూడా కాలుష్యంనుంచి రక్షించవచ్చంటున్నారు.

ఈ సమాచారం ఇంటర్నెట్‌లో లభ్యమైన అధ్యయనాలు మరియు నివేదికల ఆధారంగా అందించబడింది. వ్యక్తిగత ఆరోగ్య సలహాల కోసం తప్పనిసరిగా ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.

Exit mobile version