Beerakaya Chutney Recipe: బీరకాయతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.. ఓ శాస్త్రీయ అధ్యయనం ప్రకారం, బీరకాయలో 20.6 శాతం ఫైబర్ , 7.7 శాతం ఖనిజాలు ఇలా ఎన్నో పోషకాలు ఉన్నాయి.. అయితే బీరకాయ పేరు వినగానే చాలామంది పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ, అదే బీరకాయతో కారంగా, దేశీ స్టైల్‌లో చట్నీ తయారు చేస్తే మాత్రం అన్నం మీద మళ్లీ మళ్లీ వేసుకుని తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ముఖ్యంగా వేడి పప్పు, అన్నం, నెయ్యితో కలిపి తింటే ఈ బీరకాయ చట్నీ రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. వెల్లుల్లి, అల్లం, ఎండు మిరపకాయలతో వేయించి చేసే ఈ చట్నీకి ప్రత్యేకమైన స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. రోటీ, పరాటా లేదా ఇడ్లీ, దోసెలతో కూడా దీనిని సర్వ్ చేయొచ్చు. ఇంట్లో సులభంగా తయారు చేసుకునే ఈ రుచికరమైన బీరకాయ చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
* తాజాగా ఉన్న లావుగా ఉన్న బీరకాయలు – 2
* వెల్లుల్లి రెబ్బలు – 5 నుంచి 7
* అల్లం – చిన్న ముక్క
* ఎండు మిరపకాయలు – 3
* పచ్చి మిరపకాయలు – 3
* నూనె – 3 నుంచి 4 టీస్పూన్లు
* ఇంగువ – చిటికెడు
* ఉప్పు – తగినంత
తయారీ విధానం
ముందుగా బీరకాయలను శుభ్రంగా కడిగి మధ్యలో రెండు ముక్కలుగా కోయాలి. వాటిపై కొద్దిగా నూనె రాసి, చిన్న చిన్న గాట్లు పెట్టి వెల్లుల్లి రెబ్బలను అందులో పెట్టాలి. ఇప్పుడు బీరకాయలను తక్కువ మంటపై నెమ్మదిగా వేయించాలి. అన్ని వైపులా సమానంగా ఉడికేలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. బీరకాయ మెత్తబడిన తర్వాత చల్లటి నీటిలో వేసి తొక్క తీసేయాలి. తర్వాత వేయించిన బీరకాయ ముక్కలు, ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, ఇంగువ అన్నింటిని రుబ్బే రాయి లేదా మిక్సర్‌లో వేసి దొరుకుగా రుబ్బుకోవాలి. తయారైన చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుని తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. అంతే.. కారంగా, రుచిగా ఉండే దేశీ స్టైల్ బీరకాయ చట్నీ సిద్ధం.
ఈ చిట్కాలు పాటిస్తే రుచి మరింత పెరుగుతుంది
చట్నీ కోసం ఎప్పుడూ తాజాగా ఉన్న, కొద్దిగా మందంగా ఉండే బీరకాయలను ఎంచుకోవాలి. చాలా సన్నగా ఉన్న బీరకాయలు రుచిని తగ్గిస్తాయి. బీరకాయను ఎప్పుడూ తక్కువ మంటపైనే వేయించాలి. అలా చేస్తే లోపల వరకూ బాగా ఉడికి మంచి రుచి వస్తుంది. వేయించే సమయంలో తరచూ తిప్పుతూ ఉంటే ఒక వైపు మాత్రమే మాడిపోకుండా ఉంటుంది. ఈ బీరకాయ చట్నీని ఒకసారి రుచి చూస్తే ఇంట్లో అందరూ మళ్లీ మళ్లీ చేయమని అడగడం ఖాయం.
