Pitod Ki Sabzi: ఇంట్లో ఏ కూరగాయలూ లేనప్పుడు “ఈరోజు వంట ఏం చేయాలిబ్బా?” అని మహిళలు ఆలోచనలో పడుతుంటారు. సరిగ్గా ఇలాంటి సమయాల్లోనే మన వంటింట్లో ఎప్పుడూ సిద్ధంగా ఉండే శనగపిండి మనకి బాగా ఉపయోగపడుతుంది. రాజస్థాన్ సాంప్రదాయ వంటకమైన ‘పితోడ్ సబ్జీ’ (Pitod Ki Sabzi) ఇలాంటి సందర్భాలకు ఒక అద్భుతమైన ఆప్షన్. ఇది నిమిషాల్లో తయారవ్వడమే కాకుండా, తింటుంటే నోట్లో వెన్నలా కరిగిపోతుంది. చాలా తక్కువ సామగ్రితో, ఇంట్లో ఉండే సాధారణ మసాలాలతోనే దీనిని తయారు చేయవచ్చు. రుచిలో మాత్రం ఇది షాహీ పనీర్ లేదా మలై కోఫ్తాకి ఏమాత్రం తీసిపోదు. శనగపిండి చిక్కటి మిశ్రమాన్ని ఉడికించి, ప్లేట్‌పై వేసి బిళ్లలుగా (బర్ఫీలా) కట్ చేస్తారు. ఆ తర్వాత పుల్లటి పెరుగు, రుచికరమైన మసాలాలతో చేసిన చిక్కటి గ్రేవీలో వేసి ఉడికిస్తారు. మధ్యాహ్నం లంచ్ అయినా, రాత్రి డిన్నర్ అయినా సరే.. వేడివేడి రొట్టెలు, పరాటాలు లేదా జీరా రైస్‌తో ఈ పితోడ్ కూర తింటే ఆ మజాయే వేరు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు:
పితోడ్ (శనగపిండి బిళ్లల) కోసం:
శనగపిండి – 1 కప్పు
పెరుగు (లైట్‌గా పుల్లగా ఉన్నది) – 1/2 కప్పు
నీళ్లు – 2.5 నుండి 3 కప్పులు
వాము – 1/2 చిన్న స్పూన్
ఇంగువ – చిటికెడు
పసుపు – 1/4 చిన్న స్పూన్
కారం – 1/2 చిన్న స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – 1 చిన్న స్పూన్
గ్రేవీ కోసం:
పెరుగు (బాగా విస్క్ చేసినది) – 1/2 కప్పు
జీలకర్ర, ఆవాలు – కలిపి 1/2 చిన్న స్పూన్
అల్లం-పచ్చిమిర్చి పేస్ట్ – 1 చిన్న స్పూన్
పసుపు – 1/2 చిన్న స్పూన్
ధనియాల పొడి – 1 పెద్ద స్పూన్
కారం – 1 చిన్న స్పూన్
గరం మసాలా – 1/4 చిన్న స్పూన్
కస్తూరి మేతి – 1 చిన్న స్పూన్
కొత్తిమీర – తరిగి పెట్టుకున్నది
నూనె – 2 పెద్ద స్పూన్లు
తయారీ విధానం:
1. పితోడ్ (శనగపిండి బర్ఫీ) తయారు చేయడం:
ఒక గిన్నెలో శనగపిండి, పెరుగు, పసుపు, కారం, ఇంగువ, వాము, ఉప్పు వేయండి. ఆ తర్వాత 2.5 నుంచి 3 కప్పుల నీటిని కొద్దికొద్దిగా పోస్తూ ఎక్కడా ఉండలు లేకుండా పల్చటి మిశ్రమంలా కలుపుకోండి. అనంతరం.. బాణలిలో 1 చిన్న స్పూన్ నూనె వేసి వేడిచేసి, తయారు చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని పోయండి. అడుగు పట్టకుండా మీడియం మంటపై వరుసగా కలుపుతూ ఉడికించాలి. 7-8 నిమిషాల్లో ఈ మిశ్రమం దగ్గరపడి బాణలిని వదిలేస్తూ చిక్కగా మారుతుంది. ఒక ప్లేట్ లేదా పళ్లెం వెనుక భాగానికి కొద్దిగా నూనె రాయండి. ఉడికిన శనగపిండి మిశ్రమాన్ని వెంటనే దానిపై వేసి సమానంగా పరచండి. ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. మిశ్రమం చల్లారిన తర్వాత దానిని బర్ఫీ లేదా చతురస్రాకారపు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు మన శనగపిండి పితోడ్ ముక్కలు సిద్ధమైనట్లే.
2. రుచికరమైన గ్రేవీ తయారు చేయడం:
ముందుగా ఒక గిన్నెలో బాగా కలిపిన పెరుగు తీసుకుని, అందులో పసుపు, ధనియాల పొడి, కారం, కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌లా చేయండి (పెరుగులో మసాలాలు కలపడం వల్ల గ్రేవీ వండేటప్పుడు పెరుగు విరిగిపోకుండా ఉంటుంది). బాణలిలో 2 పెద్ద స్పూన్ల నూనె వేడి చేసి, జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసి తాలింపు పెట్టండి. తర్వాత అల్లం-పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించండి. మంట తగ్గించి, ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగు-మసాలా మిశ్రమాన్ని అందులో పోయండి. మసాలాల నుంచి నూనె వేరయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. ఇప్పుడు సరిపడా (సుమారు 1.5 నుంచి 2 కప్పులు) నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రేవీని బాగా మరగనివ్వండి. గ్రేవీ బాగా మరుగుతున్నప్పుడు, కట్ చేసి పెట్టుకున్న శనగపిండి పితోడ్ ముక్కలు, కస్తూరి మేతి వేయండి. గ్రేవీలోని రసం పితోడ్ ముక్కలకి బాగా పట్టేలా సన్నని మంటపై 2-3 నిమిషాలు మూతపెట్టి ఉడికించండి. చివరగా పైనుంచి గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేయండి. ఘుమఘుమలాడే వేడివేడి ‘పితోడ్ కూర’ సిద్ధమైంది. దీనిని వేడి రొట్టెలు, పరాటాలు, జొన్న లేదా సజ్జ రొట్టెలు లేదా జీరా రైస్‌తో వడ్డిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది.

