Kala Chana Pulao Recipe: రొటీన్‌గా చేసుకునే వెజిటబుల్ పులావ్, కిచిడీల కంటే భిన్నంగా, హెల్తీగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే “కాలా చనా పులావ్” (నల్ల శనగల పులావ్) పర్ఫెక్ట్ ఛాయిస్. నల్ల శనగల్లో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. లంచ్‌బాక్స్‌లకైనా , వీకెండ్ స్పెషల్ మెనూకైనా ఎంతో రుచిగా, బలాన్నిచ్చే ఈ పులావ్‌ను కుక్కర్‌లో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం!
కావలసిన పదార్థాలు:
- నల్ల శనగలు: 1 కప్పు (కనీసం 8 గంటలు నానబెట్టినవి)
- బాస్మతి బియ్యం: 1 కప్పు (30 నిమిషాలు నానబెట్టినవి)
- నూనె: 1 టేబుల్ స్పూన్, నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
- హోల్ బిర్యానీ మసాలా: జీలకర్ర, ఇలాచీ, దాల్చినచెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు
- కూరగాయలు: ఉల్లిపాయలు (2), టమోటాలు (2), పచ్చిమిర్చి (3) (అన్నీ సన్నగా తరిగినవి)
- అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
- మసాలా పొడులు: ఉప్పు (తగినంత), పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కశ్మీరీ కారం, గరం మసాలా (ఇవన్నీ ఒక్కోీ టీస్పూన్ చొప్పున)
- ఆకులు: కొత్తిమీర, పుదీనా (తగినంత)
తయారీ విధానం (స్టెప్-బై-స్టెప్):
1. శనగలను ఉడికించడం
ముందుగా నానబెట్టిన నల్ల శనగలను శుభ్రంగా కడిగి ప్రెజర్ కుక్కర్‌లో వేయాలి. అందులో శనగలు మునిగేలా తగినన్ని నీళ్లు పోసి, కొంచెం ఉప్పు, పసుపు వేసి మూత పెట్టాలి. మీడియం మంట మీద 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. శనగలు ఉడికిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. అయితే, శనగలు ఉడికించిన నీటిని పారబోయకుండా పక్కన పెట్టుకోవాలి (ఇది దాదాపు 1 కప్పు ఉండాలి), ఎందుకంటే ఇందులోనే అసలైన పోషకాలన్నీ ఉంటాయి. దీన్ని మనం పులావ్ ఉడికించడానికి వాడుతాం.
2. గ్రేవీ , పోపు సిద్ధం చేయడం
ఇప్పుడు అదే కుక్కర్‌లో నూనె , నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగాక జీలకర్ర, ఇలాచీ, దాల్చినచెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేపాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, టమోటా ముక్కలు వేసి.. టమోటాలు బాగా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి.
3. మసాలాలు , శనగలు కలపడం
టమోటాలు మగ్గిన తర్వాత మంటను తగ్గించి.. అందులో ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కశ్మీరీ కారం, , గరం మసాలా వేసి మసాలాల పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు బాగా కలపాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న నల్ల శనగలను ఈ మసాలా మిశ్రమంలో వేసి బాగా కలిపి, పైనుంచి సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర చల్లుకోవాలి.
4. పులావ్ ఉడికించడం
మసాలా అంతా శనగలకు పట్టిన తర్వాత, ముందే నానబెట్టి ఉంచిన బాస్మతి బియ్యాన్ని (నీళ్లు లేకుండా) కుక్కర్లో వేయాలి. బియ్యం విరిగిపోకుండా మెల్లగా ఒకసారి కలిపి.. మనం దాచి ఉంచుకున్న 1 కప్పు శనగల నీటిని పోయాలి. (సాధారణంగా 1 కప్పు బియ్యానికి 1.5 నుండి 2 కప్పుల నీరు పడుతుంది, కాబట్టి శనగల నీళ్లతో పాటు అవసరమైతే మరికొన్ని మామూలు నీళ్లు పోసుకోవచ్చు). ఈ స్టేజ్‌లో ఒకసారి ఉప్పు సరిచూసుకుని, కుక్కర్ మూత పెట్టేసి మీడియం మంట మీద 8 నిమిషాల పాటు లేదా రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
సర్వింగ్
కుక్కర్ ప్రెజర్ పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీస్తే.. పొడిపొడిగా, సువాసనలతో కూడిన వేడి వేడి “కాలా చనా పులావ్” రెడీ అయిపోతుంది. దీన్ని చల్లటి ఆనియన్ రాయితా లేదా ఏదైనా కుర్మాతో సర్వ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. హెల్త్ అండ్ టేస్ట్ కలిసిన ఈ ప్రొటీన్ రిచ్ పులావ్‌ను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి!
