Khatti Meethi Dal Recipe: తీపి + పులుపు మ్యాజిక్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడిగే గుజరాతీ కట్టి మీఠీ దాల్.!

  • నోరూరించే గుజరాతీ స్టైల్ పప్పు రెసిపీ
  • చింతపండు – బెల్లం కాంబోతో అదిరే టేస్ట్
  • 30 నిమిషాల్లో రెడీ అయ్యే సూపర్ లంచ్ ఐటమ్
  • అన్నం, చపాతీతో తింటే అదిరిపోయే ఫ్లేవర్
Katti Meeti Dal

Katti Meeti Dal

Khatti Meethi Dal Recipe in Telugu : మనం రెగ్యులర్‌గా ఇంట్లో చేసుకునే పప్పు బోర్ కొట్టిందా? అయితే ఈసారి కాస్త డిఫరెంట్‌గా గుజరాతీ స్టైల్ ‘కట్టి మీఠీ దాల్’ (Khatti Meethi Dal) ట్రై చేయండి. తీపి, పులుపు , కాస్త కారం కలగలిసిన ఈ పప్పు టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పప్పుతో తింటే లంచ్ లేదా డిన్నర్ పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. లంచ్ బాక్స్‌లలోకి కూడా క్విక్‌గా చేసుకోగలిగే ఈ టేస్టీ నార్త్ ఇండియన్ రెసిపీ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు:

  • కందిపప్పు (Tur Dal): 1 కప్పు
  • నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
  • పోపు దినుసులు: ఆవాలు (1 టీస్పూన్), జీలకర్ర (1 టీస్పూన్), మెంతులు (పావు టీస్పూన్), ఇంగువ (పావు టీస్పూన్)
  • వేరుశెనగ గుళ్లు: 2 టేబుల్ స్పూన్లు
  • ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు , కరివేపాకు
  • టొమాటో: 1 (చిన్నగా తరిగినది)
  • చింతపండు గుజ్జు: 1 టేబుల్ స్పూన్
  • బెల్లం తురుము: 2 టేబుల్ స్పూన్లు
  • మసాలాలు: ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి
  • గార్నిషింగ్ కోసం: కొత్తిమీర , నిమ్మరసం

తయారీ విధానం చాలా ఈజీ:
పప్పును పర్ఫెక్ట్‌గా ఉడికించడం:
ముందుగా ఒక కప్పు కందిపప్పును నీట్ గా కడిగి కనీసం 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. దీనివల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు కుక్కర్‌లో నానబెట్టిన పప్పు, తగినంత నీళ్లు, పావు టీస్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పప్పు బాగా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ప్రెజర్ పోయాక గరిటె లేదా పప్పు గుత్తితో మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి.

కమ్మని నెయ్యి పోపు:
స్టవ్ ఆన్ చేసి పాన్‌లో రెండు చెంచాల నెయ్యి వేసి వేడి చేయాలి (నూనె కంటే నెయ్యి వాడితేనే ఈ పప్పు టేస్ట్ ఒరిజినల్‌గా వస్తుంది). నెయ్యి కరిగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి , వేరుశెనగ గుళ్లు వేసి లైట్‌గా ఫ్రై చేయాలి. వేరుశెనగలు కాస్త వేగాక ఇంగువ, పచ్చిమిర్చి ముక్కలు, తురిమిన అల్లం, కరివేపాకు వేసి మంచి వాసన వచ్చే వరకు పోపును వేయించుకోవాలి.

మసాలా , బెల్లం మిశ్రమం:
ఇప్పుడు ఈ పోపులోనే సన్నగా తరిగిన టొమాటో ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. టొమాటోలు ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు, మీ రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ వెంటనే రెండు టేబుల్ స్పూన్ల బెల్లం తురుము కూడా వేసి అది కరిగే వరకు కలపాలి. చింతపండు పులుపు, బెల్లం తీపి కలిసి మంచి గ్రేవీలా తయారవుతుంది.

పప్పు వేసి మరిగించడం:
ఈ మసాలా మిశ్రమంలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును పోయాలి. పప్పు మరీ చిక్కగా అనిపిస్తే ఒక కప్పు నీళ్లు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్‌ని చిన్న మంటపై (Low Flame) ఉంచి, పప్పును ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఇలా చేయడం వల్ల మసాలాలు, పులుపు, తీపి అన్నీ పప్పుకు బాగా పడతాయి.

చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని, స్టవ్ ఆఫ్ చేసాక కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే వేడి వేడి గుజరాతీ కట్టి మీఠీ దాల్ రెడీ. దీన్ని రైస్ లేదా చపాతీలతో కలిపి తింటే ఇంట్లో అందరూ లొట్టలేసుకుంటూ తింటారు!