Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..

Bottle Gourd Roti

Bottle Gourd Roti

Bottle Gourd Roti Recipe: ఆరోగ్యానికి ఎంతో మంచిదైన సొరకాయ పేరు వింటేనే ఇంట్లో చాలామంది ముఖం చాటేస్తుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరూ కూర లేదా పప్పు రూపంలో దీన్ని తినేందుకు ఇష్టపడరు. అలాంటి వాళ్ల కోసం ఎంతో రుచికరమైన, పోషకాలు నిండిన ఈ సొరకాయ వంటకాన్ని తయారు చేయొచ్చు. నిజానికి దీని టేస్ట్ ఎంత బాగుంటుందంటే, పిల్లలు ఎలాంటి పేచీలు పెట్టకుండా ఇష్టంగా తింటారు. ఇది ఉదయం అల్పాహారానికైనా, రాత్రి డిన్నర్‌కైనా ఓ పర్ఫెక్ట్ అండ్ హెల్తీ ఆప్షన్. తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

తాజా సొరకాయ (తురుముకున్నది)
2 కప్పుల గోధుమ పిండి
అర టీస్పూన్ వాము, జీలకర్ర
అర టీస్పూన్ పసుపు, కారం
అర టీస్పూన్ గరం మసాలా, ఇంగువ
2 నుంచి 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర
తగినంత ఉప్పు, 1 టేస్పూన్ నెయ్యి లేదా నూనె (పిండి కలపడానికి)
కాల్చుకోవడానికి తగినంత నెయ్యి లేదా వెన్న

తయారీ విధానం:

ముందుగా సొరకాయ పొట్టు తీసి సన్నగా తురుముకోవాలి. ఆ తురుములో కొద్దిగా ఉప్పు కలిపి ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టాలి. దాంతో అందులోని అదనపు నీరంతా బయటకు వస్తుంది. ఆ నీటిని పారేయకుండా, పిండి కలుపుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఓ పెద్ద గిన్నెలో గోధుమ పిండి, నీరు పిండేసిన సొరకాయ తురుము, వాము, జీలకర్ర, మసాలా దినుసులు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న సొరకాయ నీటితోనే పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. కొద్దిగా పొడి పిండి అద్దుకుంటూ సాధారణ రోటీలా లేదా కొద్దిగా మందంగా పూరీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి వేడి అయ్యాక.. ఒత్తుకున్న పూరీని దానిపై వేయాలి. రెండు వైపులా సరిగ్గా కాలిన తర్వాత నెయ్యి లేదా వెన్న రాసుకుంటూ మంచి రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా చేస్తే ఎంతో మృదువైన, రుచికరమైన, పోషకాలు నిండిన సొరకాయ పూరీలు రెడీ అయిపోతాయి. వీటిని పెరుగుతో, ఊరగాయతో లేదా మీకు నచ్చిన చట్నీతో వేడివేడిగా తింటే ఆ రుచే వేరు..