శరీరంలో కొవ్వు పేరుకుపోతుందా? అయితే దీనికి సరళమైన మరియు ప్రభావవంతమైన పరిష్కారం నడక. నడక కేవలం కేలరీలను బర్న్ చేయడమే కాకుండా శరీర జీవక్రియను వేగవంతం చేస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అన్ని వయసుల వారు సులభంగా చేయగలిగే అత్యుత్తమ వ్యాయామం నడకే. క్రమం తప్పకుండా నడవడం వల్ల కీళ్ల నొప్పుల ప్రమాదం కూడా తగ్గుతుంది. చాలా మంది భోజనం చేసిన వెంటనే పడుకుంటారు, కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే.. భోజనం చేసిన తర్వాత 10 నుంచి 20 నిమిషాల పాటు మితమైన వేగంతో నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే ఆహారం త్వరగా జీర్ణం కావడానికి, శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉండటానికి నడక ఎంతో సహాయపడుతుంది. రోజూ నడకను అలవాటుగా జీవితంలో భాగం చేసుకుంటే మంచి ఆరోగ్యాన్ని సులభంగా పొందవచ్చు.
కొంచెం వేగంగా, చేతులను లయబద్ధంగా ఆడిస్తూ నడవడాన్ని పవర్ వాకింగ్ అంటారు. సాధారణ నడకకు పవర్ వాకింగ్‌కు మధ్య స్పష్టమైన తేడా ఉంది. పవర్ వాకింగ్ వల్ల హృదయ స్పందన రేటు పెరిగి, కేలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఇది మోకాళ్లపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తూ శరీర దృఢత్వాన్ని పెంచుతుంది. చదునైన నేలపై నడవడంకంటే మెట్లు ఎక్కడం లేదా ఎత్తు–పల్లాలు ఉన్న ప్రదేశాల్లో నడవడం ఎక్కువ శ్రమను అవసరం చేస్తుంది. ఇది తొడలు, పొట్ట కండరాలపై ఎక్కువ ప్రభావం చూపి, మొండిగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఈ సమాచారం అంతా ఇంటర్నెట్ నుంచి గ్రహించాం. మీరు దీన్ని ఫాలో అయ్యేముందు డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం.
