నిద్రలేమితో బరువు పెరుగుతారని మీకు తెలుసా..
నిద్రలేమి వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న సంగతి చాలా మందికి తెలియదు. కొందరు బరువు తగ్గేందుకు ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ, కఠినమైన డైట్ పాటిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించకపోవడంతో నిరాశ చెందుతుంటారు. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి సరైన నిద్ర లేకపోవడమే. నేటి బిజీ జీవనశైలిలో చాలామంది తమ ఆరోగ్యంపై సరైన శ్రద్ధ పెట్టడం లేదు. ఎక్కువ తింటేనే బరువు పెరుగుతారని అనుకోవడం పూర్తిగా నిజం కాదు; తగినంత నాణ్యమైన నిద్ర లేకపోయినప్పటికీ శరీరంలో కొవ్వు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
డైట్ పాటిస్తూ, వ్యాయామం చేస్తూనే ఉన్నా సరైన నిద్ర లభించకపోతే శరీరం అదనపు కొవ్వును సమర్థవంతంగా కరిగించలేదని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఒకే డైట్ అనుసరించిన వారిలో తక్కువ నిద్రపోయినవారు, ఎక్కువ నిద్రపోయిన వారితో పోలిస్తే సుమారు 55% తక్కువ కొవ్వును కోల్పోతారని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీర్ఘకాలంగా నిద్ర తక్కువగా ఉండడం వల్ల శరీరంలోని సర్కేడియన్ రిథమ్ దెబ్బతిని, హార్లూరణల అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల ఆకలిని పెంచే ఘ్రెలిన్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ అధికమవడంతో శరీరం కొవ్వును కరిగించకుండా నిల్వ చేసుకుంటుంది. ఈ కారణాలతో బరువు పెరిగి ఊబకాయం వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుంది.
అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, బరువు తగ్గడంలో మెరుగైన ఫలితాలు పొందాలంటే రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర తప్పనిసరిగా అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా అందించబడింది. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే తప్పనిసరిగా ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.
