మహిళల్లో సాధారణంగా 50 నుంచి 55 ఏళ్ల వయస్సులో మెనోపాజ్ (రుతువిరతి) వస్తుంది. అయితే ఇటీవలి కాలంలో మారుతున్న జీవనశైలి, ఇతర కారణాల వల్ల కొందరిలో 40 లేదా 45 ఏళ్ల వయస్సులోనే ఇది వస్తోంది. దీనిని ‘ఎర్లీ మెనోపాజ్’ లేదా 40 ఏళ్లకంటే ముందే వస్తే ‘ప్రిమెచ్యూర్ మెనోపాజ్’ అని పిలుస్తారు. స్త్రీకి వరుసగా 12 నెలల పాటు ఎలాంటి కారణం లేకుండా రుతుస్రావం ఆగిపోతే దానిని మెనోపాజ్ అంటారు.
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, అండాశయాల పనితీరు మందగించడం వల్ల ఇది సహజంగానే జరుగుతుంది. అయితే చిన్న వయసులోనే ఇది రావడానికి అకాల అండాశయ వైఫల్యం (POI), వంశపారంపర్య కారణాలు, ఆటోఇమ్యూన్ సమస్యలు, జన్యుపరమైన లోపాలు , కొన్ని వైద్య చికిత్సలు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. ఈ దశలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోవడం వల్ల వేడి ఆవిర్లు, అధిక చెమట, గుండెదడ, ఆందోళన, నిరాశ, చిరాకు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ముఖ్యంగా ముప్పైల వయసులో ఉన్న మహిళలు రుతుక్రమంలో తేడాలు గమనిస్తే, వాటిని ఒత్తిడి అనుకుని నిర్లక్ష్యం చేయకూడదు. తక్కువ AMH స్థాయిలు, ఆంట్రల్ ఫోలిక్యులర్ కౌంట్ తగ్గిపోవడం దీనికి సంకేతాలు కావచ్చు. చిన్న వయసులో రుతువిరతి రావడం వల్ల ఎముకల క్షీణత (ఆస్టియోపొరోసిస్) ముప్పు పెరుగుతుంది. అలాగే దీర్ఘకాలిక ఈస్ట్రోజెన్ లోపం గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. పిల్లలు కనాలని కోరుకునే మహిళలు ముందుగానే గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, అండాశయ నిల్వలను పరీక్షించుకోవడం చాలా ముఖ్యం.
ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంతగానో సహాయపడుతుంది. సమతుల్య ఆహారం తీసుకోవడం, రోజూ యోగా, ధ్యానం, నడక వంటి వ్యాయామాలు చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. వైద్యుల సూచన మేరకు విటమిన్ డి, విటమిన్ బి12, కాల్షియం సప్లిమెంట్లు తీసుకోవాలి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో డాక్టర్ల పర్యవేక్షణలో హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (HRT) కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
అలాగే మెనోపాజ్ తర్వాత యోని నుంచి ఊహించని రక్తస్రావం, మచ్చలు లేదా అసాధారణ స్రావాలు కనిపిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి గర్భాశయ లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. కాబట్టి ఋతుక్రమంలో ఎలాంటి అసమతుల్యత కనిపించినా వెంటనే గైనకాలజిస్ట్ లేదా ఎండోక్రినాలజిస్ట్‌ను సంప్రదించి తగిన వైద్య సలహా తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని, మంచి జీవన ప్రమాణాలను కాపాడుకోవచ్చు.

