తల్లిపాలు శిశువుకు అమృతంతో సమానం. అది ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రకృతి అద్భుతం. తొలిసారి చనుబాలు పట్టించే సమయంలో ఆ తల్లి, బిడ్డ పొందే మధురానుభూతిలో జీవితకాలపు ఆరోగ్యం ఇమిడి ఉంటుంది. ముఖ్యంగా డెలివరీ తర్వాత కొంత మంది తల్లులు శరీరాకృతి కోల్పోతారు. తిరిగి దాని సాధించుకోవాలని అనుకునే అమ్మలు చాలామంది ఉంటారు. అయితే ‘చనుబాలు ఇవ్వడం వల్ల బరువు త్వరగా తగ్గుతుందా?’ అన్న మాట మనం తరచూ వింటూ ఉంటాం. శిశువుకు ముఖ్యమైన పోషకాలు అందించే ఈ ప్రక్రియ తల్లి ఆరోగ్యానికీ ప్రయోజనకరమా? ఈ పరిశోధనలపై, వైద్య నిపుణుల విశ్లేషణలు చెబుతున్న దాని ప్రకారం..
Also Read : Huma Qureshi’ :పార్కింగ్ వివాదంలో హీరోయిన్ సోదరుడి హత్య..
తల్లిపాలు శిశువుకు అవసరమైన పోషకాలు అందించడమే కాకుండా, తల్లి ఆరోగ్యం పై కూడా సానుకూల ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పరిశోధనల ప్రకారం, చనుబాలు ఇస్తున్న తల్లులు రోజుకు సుమారు 300–500 అదనపు క్యాలరీలు ఖర్చు చేస్తారట. ఈ అదనపు ఎనర్జీ వినియోగం బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, పాలిచ్చే సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ హార్మోన్ గర్భాశయాన్ని తిరిగి తన సహజ పరిమాణానికి చేర్చడంలో, పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించడంలో తోడ్పడుతుంది.
అయితే ఇది ప్రతి ఒక్కరికి ఒకేలా ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కొందరు తల్లులు త్వరగా బరువు తగ్గుతారు, మరికొందరికి ఎక్కువ సమయం పడుతుంది. జన్యువులు, హార్మోన్ మార్పులు, గర్భం రాకముందు బరువు, ఆహారపు అలవాట్లు, వ్యాయామం, ఒత్తిడి వంటి అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయి. మరి ముఖ్యంగా, చనుబాలు ఇస్తున్న సమయంలో అతిగా డైటింగ్ చేయడం లేదా వేగంగా బరువు తగ్గే ప్రయత్నం చేయడం పాల ఉత్పత్తి తల్లి ఆరోగ్యానికి హానికరం కావచ్చు. కాబట్టి, చనుబాలు ఇవ్వడం బరువు తగ్గడంలో సహాయపడినా, దీన్ని మ్యాజిక్ సొల్యూషన్‌గా చూడకూడదు. ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నీరు, తేలికపాటి వ్యాయామం కలిపి పాటించడం ద్వారా తల్లులు శరీరాన్ని క్రమంగా ఆరోగ్యవంతం చేసుకోవచ్చు. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకోవడం ఉత్తమం.
