Site icon NTV Telugu

Diabetes Symptoms: ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ఇక అంతే సంగతులు..

Diabetes Symptoms

Diabetes Symptoms

Diabetes Symptoms: దేశంలో ఈ రోజుల్లో డయాబెటిస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వాస్తవానికి ఈ వ్యాధి అన్ని వయసుల వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా పని చేయనప్పుడు లేదా తగినంత పరిమాణంలో ఉత్పత్తి కానప్పుడు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. అప్పుడు ఇది రక్తంలో అధిక చక్కెర స్థాయిలకు దారితీస్తుంది. దానిని డయాబెటిస్ అని పిలుస్తారు. సాధారణంగా ఏమి తినని సమయంలో చక్కెర స్థాయిలు 70 – 100 mg/dL మధ్య ఉంటాయి. 100 -125 mg/dL ప్రీ-డయాబెటిస్‌ను సూచిస్తాయి, 126 mg/dL కంటే ఎక్కువ ఏదైనా కూడా డయాబెటిస్‌ను సూచిస్తుంది. అందుకని ఈ వ్యాధి లక్షణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

READ ALSO: Ustaad Bhagat Singh: ఓజీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సాంగ్ ప్రోమోకి డేట్ ఫిక్స్

రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి అత్యంత సాధారణ కారణం ఇన్సులిన్ పనితీరు సరిగా లేకపోవడం. జీవనశైలి సరిగా లేకపోవడం, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం, ఒత్తిడి, నిద్ర లేకపోవడం, హార్మోన్ల మార్పులు, జన్యుపరమైన కారణాలు కూడా రక్తంలో అధిక చక్కెరకు కారణం అవుతాయి. రక్తంలో ఎక్కువ కాలం చక్కెర స్థాయిలు ఉన్నప్పుడు, అవి గుండె, మూత్రపిండాలు, కళ్లు, నరాలు, చర్మాన్ని ప్రభావితం చేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం, దృష్టి కోల్పోవడం, నరాల తిమ్మిరి, గాయాలు సరిగా నయం కాకపోవడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తు్న్నారు. అందువల్ల రక్తంలో అధిక చక్కెరను గుర్తిస్తే వెంటనే దానిని నియంత్రించడం చాలా ముఖ్యం అని సూచించారు.

లక్షణాలు ఇవే..
పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, శరీరం దాహం పెరగడం, తరచుగా మూత్రవిసర్జన చేయడం, ఆకలి పెరగడం, అలసట, దృష్టి మసకబారడం, బరువు తగ్గడం లేదా పెరగడం, చర్మం పొడిబారడం, గాయం నయం కావడం నెమ్మదిగా ఉండటం వంటి అనేక సంకేతాలను కనిపిస్తాయని సూచించారు. కొన్నిసార్లు పాదాలు, చేతుల్లో జలదరింపు లేదా తిమ్మిరి వంటి అనుభూతి కలుగుతుందని చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా పెరిగితే, అప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గందరగోళం, వేగవంతమైన హృదయ స్పందన, వాంతులు, మూర్ఛపోవడం, నిర్జలీకరణం, కీటోయాసిడోసిస్ ప్రమాదం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇంకా తరచుగా ఇన్ఫెక్షన్లు, చర్మంపై దురద కూడా షుగర్ వ్యాధికి సంకేతాలు కావచ్చని పేర్కొన్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. ఎందుకంటే వెంటనే చికిత్స చేయకపోతే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు.

దీనిని ఎలా నియంత్రించాలంటే..

ప్రతిరోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.

చక్కెర, పిండి, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.

ఫైబర్, కూరగాయలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవాలి.

బరువును అదుపులో ఉంచుకోవడం, తగినంత నిద్రపోవడం చేయాలి.

ఎక్కువగా నీరు తాగాలి, అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాలి.

డాక్టర్ సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవడంతో పాటు నిత్యం శరీరంలో చక్కెరను తనిఖీ చేస్తూ ఉండాలి.

READ ALSO: FIFA World Cup 2026 Schedule: ఫిఫా వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది.. పోటీలో 48 దేశాలు.. 16 వేదికలు

Exit mobile version