Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!

Curry Leaves Pickle

Curry Leaves Pickle

Curry Leaves Pickle Recipe: వంటల్లో సువాసన కోసం వేసి, తినేటప్పుడు పక్కన పెట్టే కరివేపాకుతో అద్భుతమైన నిల్వ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకుతో ఈ విధంగా పచ్చడి చేసుకుంటే, వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటుంటే ఆ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇంట్లో పప్పు, కూరలు ఉన్నా సరే వాటిని పక్కన పెట్టి మరీ ఈ పచ్చడితోనే భోజనం మొత్తం పూర్తి చేస్తారు. అంతటి కమ్మని కరివేపాకు నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

* ముదురు కరివేపాకు: 4 కప్పులు (శుభ్రం చేసి, తడి లేకుండా ఆరబెట్టినది)
* పల్లీ నూనె (వేరుశనగ నూనె): 1 కప్పు (కరివేపాకు కొలుచుకున్న కప్పుతోనే)
* మెంతులు: 1 టేబుల్ స్పూన్
* ధనియాలు: 2 టేబుల్ స్పూన్లు
* శనగపప్పు: 1 టేబుల్ స్పూన్
* మినప్పప్పు: 1 టేబుల్ స్పూన్
* ఆవాలు: 1 టీస్పూన్
* జీలకర్ర: 1 టీస్పూన్
* ఎండుమిరపకాయలు: 15 – 20 (కారానికి తగినట్లుగా).

తయారీ విధానం

కరివేపాకు ఎంపిక

నిల్వ పచ్చడి కోసం ఎప్పుడూ లేత కరివేపాకును కాకుండా.. ఆకు కొంచెం పెద్దగా, మందంగా, ముదురుగా ఉన్నదానిని ఎంచుకోవాలి. ముందుగా కరివేపాకును ఒక గిన్నెడు నీటిలో వేసి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆకులకు ఉన్న మట్టి, ఇసుక వంటివి అడుగుకు చేరి ఆకు శుభ్రపడుతుంది. 15 నిమిషాల తర్వాత నీటిని కదపకుండా పైనుంచి ఆకులను మాత్రమే తీసుకుని ఒక జల్లెడలో వేసి 10 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు నీరు పోయిన తర్వాత, ఆకులను ఎండలో కాకుండా ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద ఒక కాటన్ వస్త్రం లేదా దుప్పటిపై ఆరబెట్టాలి. ఆకు పూర్తిగా ఎండిపోవాల్సిన అవసరం లేదు కానీ, తడి ఏమాత్రం లేకుండా పొడిగా అయ్యే వరకు ఆరబెట్టుకుంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

కొలతల వివరాలు

పచ్చడి రుచిగా రావడానికి సరైన కొలతలు చాలా ముఖ్యం. దీని కోసం ఏదైనా ఒక గిన్నె లేదా కప్పును కొలతగా తీసుకోవాలి. ఆరబెట్టుకున్న కరివేపాకును ఆ గిన్నెతో కొలుచుకోవాలి. ఇక్కడ నాలుగు కప్పుల కరివేపాకుకు సరిపడా కొలతలను ఉపయోగిస్తున్నాము. ఆకులను కొలుచుకునేటప్పుడే ఏవైనా పాడైన లేదా నల్లబడిన ఆకులు ఉంటే తీసివేయాలి, లేదంటే పచ్చడి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.

దినుసులను వేయించుకోవడం

కరివేపాకును కొలుచుకున్న కప్పుతోనే ఒక కప్పు పల్లీ నూనెను కడాయిలో వేసి వేడి చేయాలి. నిల్వ పచ్చళ్లకు పల్లీ నూనె అయితేనే అసలైన రుచి వస్తుంది. నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటను పూర్తిగా తగ్గించి, అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి అర నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి సన్నని మంటపైనే దోరగా వేయించుకోవాలి. మంట ఎక్కువగా పెడితే దినుసులు మాడిపోయి పచ్చడి చేదు వస్తుంది కాబట్టి జాగ్రత్తగా వేయించాలి. ఇవి కాస్త రంగు మారిన తర్వాత ఒక టీస్పూన్ ఆవాలు, ఒక టీస్పూన్ జీలకర్ర వేసి మరో అర నిమిషం పాటు వేయించాలి. దినుసులన్నీ మంచి బంగారు రంగులోకి మారిన తర్వాత, నూనె రాకుండా వాటిని మాత్రమే ఒక ప్లేట్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. దినుసులు తీసేసిన తర్వాత కడాయిలో మిగిలిన నూనెలోనే సుమారు ఎండుమిరపకాయలను వేసుకోవాలి. వీటిని కూడా సన్నని మంటపైనే రంగు మారే వరకు దోరగా వేయించుకోవాలి. ఎండుమిర్చి చక్కగా వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి.

ఎండుమిరపకాయలు వేగిన తర్వాత, మనం సిద్ధం చేసుకున్న 4 కప్పుల కరివేపాకును ఆ నూనెలో వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మధ్యమధ్యలో కలుపుతూ కరివేపాకు క్రిస్పీగా మారే వరకు వేయించాలి. ఆకు బాగా వేగితేనే పచ్చడి నిల్వ ఉంటుంది. ఆకు క్రిస్పీగా మారిన తర్వాత, గింజలు, ఈనెలు తీసి శుభ్రం చేసిన పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును విడివిడిగా చేసి వేయాలి. అలాగే ఒక చిన్న వెల్లుల్లి గడ్డలోని రెబ్బలను తొక్క తీయకుండానే విడివిడిగా చేసి వేసి లో ఫ్లేమ్‌లో ఒక నిమిషం పాటు వేయించాలి. ఆకు చేతితో నలిపితే పొడి అయ్యేంత క్రిస్పీగా మారిన తర్వాత, రుచికి సరిపడా కల్లుప్పు (రాక్ సాల్ట్) వేసి మరో నిమిషం వేయించి, చిల్లుల గరిటెతో ఆకు మిశ్రమాన్ని నూనె నుండి బయటకు తీయాలి. కడాయిలో మిగిలిన నూనెను అలాగే ఉంచాలి.

పచ్చడిని గ్రైండ్ చేసుకోవడం

ముందుగా వేయించి చల్లార్చుకున్న శనగపప్పు, ధనియాల దినుసులను ఒక మిక్సీ జార్‌లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న కరివేపాకు, ఎండుమిర్చి మిశ్రమాన్ని ఒకేసారి కాకుండా సగం వేసి గ్రైండ్ చేయాలి. అది కొద్దిగా నలిగిన తర్వాత మిగిలిన సగం కరివేపాకును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. చివరగా మనం కడాయిలో పక్కన ఉంచుకున్న మిగిలిన నూనెను కూడా ఇందులో పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చడిలో నూనె శాతం సరిపడా ఉంటేనే అది ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఇప్పుడు మరో కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, 2 లేదా 3 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించాలి. తాలింపు వేగిన వెంటనే మనం గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పచ్చడిని ఇందులో వేసి లో ఫ్లేమ్‌లో 4 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉడికించాలి. ఆ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల తురిమిన బెల్లం వేయాలి. బెల్లం వేయడం వల్ల పచ్చడికి పులుపు, కారం, తీపి సమపాళ్లలో కలిసి అద్భుతమైన రుచి వస్తుంది. బెల్లం పూర్తిగా కరిగి పచ్చడిలో కలిసే వరకు మరో 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే మన కరివేపాకు పచ్చడి రెడీ.