Sanna Karam Pusa Recipe: సాయంత్రం టీ తాగే సమయంలో లేదా పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినడానికి ఏదైనా కరకరలాడే స్నాక్ ఉంటే భలేగా ఉంటుంది. సాధారణంగా స్వీట్ షాపుల్లో దొరికే సన్న కారపూస ఎంతో రుచిగా, కరకరలాడుతూ ఉంటుంది. అయితే చాలామందికి ఇంట్లో చేస్తే నూనె పీల్చేస్తుందేమో లేదా సరిగ్గా రాదేమో అనే సందేహం ఉంటుంది. సరైన కొలతలు, చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఎవరైనా సరే ఇంట్లోనే స్వీట్ షాప్ కన్నా అద్భుతంగా, ఎంతో క్రిస్పీగా సన్న కారపూసను సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి అది ఎలానో చూసేద్దామా..
కావాల్సిన పదార్థాలు:
* శనగపిండి – 2 కప్పులు
* బియ్యప్పిండి – 1 కప్పు
* వాము పొడి – ½ టీస్పూన్
* ఉప్పు – ½ టీస్పూన్ (రుచికి సరిపడా)
* కారం – ½ టీస్పూన్
* పసుపు – ¼ టీస్పూన్
* వేడి నూనె లేదా వెన్న (బటర్) – 1 టేబుల్ స్పూన్
* నీళ్లు – తగినన్ని (పిండి కలపడానికి)
* కరివేపాకు – గుప్పెడు
* డీప్ ఫ్రైకి సరిపడా – నూనె
తయారీ విధానం
పిండిని సిద్ధం చేసుకోవడం
ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో జల్లించిన రెండు కప్పుల శనగపిండి, ఒక కప్పు పొడి బియ్యప్పిండి వేసుకోవాలి. స్వీట్ షాపుల్లో పూర్తిగా శనగపిండితోనే చేస్తారు. కానీ, బియ్యప్పిండి కలపడం వల్ల కారపూస మరింత కరకరలాడుతూ వస్తుంది. ఒకవేళ అచ్చం షాపు శైలిలోనే కావాలనుకుంటే మూడు కప్పుల శనగపిండిని వాడుకోవచ్చు. ఇప్పుడు అందులో వాము పొడి, ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. వామును నేరుగా వేస్తే సన్నని రంధ్రాల గుండా పిండి దిగదు కాబట్టి తప్పనిసరిగా పొడి చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వేడి నూనె లేదా వెన్నను వేసి పిండిని చేత్తో బాగా రబ్ చేస్తూ కలపాలి. ఇలా చేయడం వల్ల కారపూస గుల్లగా, ఎంతో క్రిస్పీగా వస్తుంది. ఆ తర్వాత తగినన్ని నీళ్లను కొద్దికొద్దిగా పోసుకుంటూ పిండిని సాఫ్ట్‌గా ముద్దలా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా లేదా పల్చగా ఉండకూడదు.
జంతికల మిషన్ తో
కారపూస చేయడానికి సన్నని రంధ్రాలు ఉండే ప్లేట్‌ను ఎంచుకుని జంతికల మిషన్ లో అమర్చాలి. పిండి అంటుకోకుండా గొట్టం లోపలి భాగంలో కొద్దిగా నూనె రాసుకోవాలి. ఆ తర్వాత కలిపి పెట్టుకున్న పిండి ముద్దను సరిపడా గొట్టంలో నింపి మూత బిగించి సిద్ధంగా ఉంచుకోవాలి.
కారపూసను ఫ్రై చేసే పద్ధతి
స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా వేడి చేయాలి. కొద్దిగా పిండి వేస్తే వెంటనే పొంగుతూ పైకి వస్తే నూనె సరైన వేడిలో ఉన్నట్లు అర్థం. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లోకి మార్చి, కడాయిలో నేరుగా పిండిని చుట్టూ ఒత్తుకోవాలి. మంటను తగ్గించి ఒత్తడం వల్ల ఆవిరి చేతికి తగలకుండా ఉంటుంది. ఒత్తిన వెంటనే మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి వేయించాలి. కారపూస సన్నగా ఉంటుంది కాబట్టి చాలా త్వరగా వేగిపోతుంది. ఒకవైపు రెండు నిమిషాలు వేగాక రెండో వైపుకు తిప్పి, రెండు వైపులా చక్కగా వేగిన తర్వాత నూనె నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ సేపు వేయిస్తే రంగు మారిపోతుంది.
కరివేపాకు తాలింపు
మొత్తం పిండితో కారపూసను వేయించి తీసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. వేడిగా ఉన్న అదే నూనెలో ఒక స్ట్రైనర్ సహాయంతో గుప్పెడు కరివేపాకును వేయించి తీసుకోవాలి. ఇలా వేయించిన కరివేపాకును కారపూసపై వేసి కలిపితే మంచి సువాసనతో పాటు రెట్టింపు రుచి వస్తుంది. ఈ విధంగా సులువైన పద్ధతిలో తయారు చేసుకున్న సన్న కారపూస ఏమాత్రం నూనె పీల్చకుండా, భలే రుచిగా ఉంటుంది. చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే ఎన్నో రోజుల పాటు కరకరలాడుతూ తాజాగా ఉంటుంది.

