Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!

Crispy Snacks

Crispy Snacks

Crispy Snacks: సాయంత్రం టీ తాగే సమయంలో లేదా పిల్లల స్కూల్ స్నాక్ బాక్స్‌లోకి అప్పటికప్పుడు తేలికగా చేసుకునే ఒక అద్భుతమైన స్నాక్ రెసిపీ ఇది. కేవలం ఇంట్లో ఉండే బొంబాయి రవ్వ, బియ్యప్పిండితో ఎంతో కరకరలాడుతూ, రుచికరంగా వీటిని తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం నుంచి పది రోజుల వరకు నిల్వ ఉంటాయి. మరి ఈ క్రేజీ స్నాక్స్ ఎలా చేయాలో చూసేద్దామా..

కావాల్సిన పదార్థాలు

* బొంబాయి రవ్వ – 1 కప్పు
* బియ్యం పిండి – 1/2 కప్పు
* వెన్న – 1 టేబుల్ స్పూన్ (లేదా వేడి నూనె – 2 టేబుల్ స్పూన్లు)
* పచ్చిమిర్చి – 2
* ఎండుమిర్చి – 1
* అల్లం – చిన్న ముక్క
* కరివేపాకు – కొద్దిగా
* జీలకర్ర – 1/2 టీస్పూన్
* వాము – 1/2 టీస్పూన్
* తెల్ల నువ్వులు – 1/2 టీస్పూన్
* కొత్తిమీర తరుగు – కొద్దిగా
* ఉప్పు – రుచికి సరిపడా
* నూనె – వేయించడానికి సరిపడా

తయారీ విధానం

మసాలా ముద్ద తయారీ

మొదట మిక్సీ జార్‌లో ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకుని వీలైనంత మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేసి ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే మిక్సీ జార్‌లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చిన్న అల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, వాము, నువ్వులు వేసుకోవాలి. నీళ్లు ఏమీ పోయకుండా ఈ మిశ్రమాన్ని కచ్చాపచ్చాగా (బరకగా) మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి.

పిండిని కలుపుకునే విధానం

బొంబాయి రవ్వ పొడి ఉన్న బౌల్‌లో అర కప్పు బియ్యం పిండి, ఒక టేబుల్ స్పూన్ వెన్న (వెన్న లేకపోతే 2 టేబుల్ స్పూన్ల కాచిన వేడి నూనె), రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. రవ్వ మాత్రమే వాడితే నూనె ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి బియ్యం పిండి కలపడం తప్పనిసరి. ఆపై ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను, సన్నగా తరిగిన కొత్తిమీరను పిండిలో వేసి బాగా పట్టించాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు చిలకరిస్తూ చపాతీ పిండిలా గట్టి ముద్దలా కలుపుకోవాలి. పిండి ఏమాత్రం పలచబడకూడదు, అర కప్పు కంటే తక్కువ నీళ్లే సరిపోతాయి.

ముక్కలుగా కట్ చేసుకునే పద్ధతి

కలిపి పెట్టుకున్న పిండిని మూడు సమాన భాగాలుగా చేసుకోవాలి. ఒత్తే పీటపై కొద్దిగా పొడి బియ్యప్పిండి చల్లుకుని, పిండి ముద్దను చతురస్రాకారంలో (స్క్వేర్ షేప్) ఉంచి చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా మీడియం మందంతో ఒత్తుకోవాలి. అంచులు సమానంగా ఉండటానికి ఎడ్జెస్‌ను కట్ చేసి పక్కన పెట్టి, పిండిని చిన్న చిన్న ముక్కలుగా (డైమండ్ లేదా స్క్వేర్ షేప్‌లో) కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ సిద్ధం చేసి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి.

వేయించుకోవడం & నిల్వ చేయడం

బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత సరిపడా ముక్కలను వేసి, మొదట మంటను ‘లో టు మీడియం’ ఫ్లేమ్‌లో ఉంచి వేయించాలి. ముందుగానే హై ఫ్లేమ్‌లో వేయిస్తే పైన రంగు మారిపోయి లోపల పచ్చిగా ఉండి క్రిస్పీగా రావు. ఇవి కొద్దిగా వేగి రంగు మారుతున్నప్పుడు మంటను పెంచి, రెండు వైపులా మంచి బంగారు రంగు (గోల్డెన్ బ్రౌన్) వచ్చేంతవరకు వేయించి తీసుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే ఎంతో కరకరలాడుతూ పది రోజుల పాటు తాజాగా ఉంటాయి.