Chocolate Pootharekulu: పూతరేకుల్లో చాక్లెట్ ట్విస్ట్! ఇలా ఎప్పుడైనా తిన్నారా?

Chocolate Pootharekulu

Chocolate Pootharekulu

Chocolate Pootharekulu: పూతరేకులు అంటే మనలో ఎంతమందికి ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. అయితే ఎప్పుడూ తినే పంచదార, బెల్లం పూతరేకులు కాకుండా… క్రంచీ మంచ్, నోరూరించే చాక్లెట్ కాంబినేషన్‌తో సరికొత్తగా ‘చాక్లెట్ పూతరేకులు’ ఎప్పుడైనా ట్రై చేశారా? వినడానికే కాకుండా తింటే కూడా అమేజింగ్‌గా ఉండే ఈ క్రేజీ ఫ్యూజన్ స్వీట్‌ను ఇంట్లోనే నోరూరించేలా ఎలా తయారుచేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

పూతరేకుల రేకులు (రేకులు): 4 నుంచి 6 (మార్కెట్లో సిద్ధంగా దొరుకుతాయి)

నెయ్యి: 3-4 టేబుల్ స్పూన్లు (కరిగించినది)

చాక్లెట్ సిరప్ (హర్షీస్ వంటివి): తగినంత

మంచ్ లేదా కిట్‌క్యాట్ చాక్లెట్లు: 2 (సన్నగా తురిమినవి లేదా ముక్కలు చేసినవి)

చాక్లెట్ చిప్స్ / కోకో పౌడర్: 1-2 టేబుల్ స్పూన్లు (ఆప్షనల్)

జీడిపప్పు, బాదం ముక్కలు: కొన్ని (ఆప్షనల్)

తయారీ విధానం:

మొదట ఒక శుభ్రమైన ప్లేట్ లేదా బోర్డు మీద ఒక పూతరేకును పరిచి, దానికి కరిగించిన నెయ్యిని సమానంగా రాయాలి. నెయ్యి రాసిన రేకుపై చాక్లెట్ సిరప్‌ను అంతటా సమానంగా పరచాలి. దానిపై తురిమిన మంచ్ (Munch) లేదా కిట్‌క్యాట్ ముక్కలు, కోకో పౌడర్, చాక్లెట్ చిప్స్‌ను చల్లాలి. నట్స్ ఇష్టపడేవారు జీడిపప్పు, బాదం ముక్కలను కూడా వేసుకోవచ్చు. దానిపై మరో పూతరేకును ఉంచి, మళ్లీ నెయ్యి, చాక్లెట్ సిరప్‌ను పూసి మడతపెట్టడానికి అనువుగా చేయాలి. రేకు చిరిగిపోకుండా జాగ్రత్తగా రెండు వైపులా లోపలికి మడిచి, రోల్ (సుట్ట) మాదిరిగా చుట్టాలి. మడతపెట్టే సమయంలో నెయ్యి అప్లై చేస్తే రేకు విరిగిపోకుండా సులభంగా మడతపడుతుంది. చివరగా రోల్ చేసిన చాక్లెట్ పూతరేకు పైన కొద్దిగా చాక్లెట్ సిరప్, చాక్లెట్ ముక్కలతో గార్నిష్ చేసుకుని ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన చాక్లెట్ పూతరేకులు రెడీ.