Interesting Health Fact About Non-veg Food Items: మనం జ్వరం బారిన పడినప్పుడు.. గుడ్డు, చికెన్, చేపలు వంటి నాన్-వెజ్ ఫుడ్ ఐటమ్స్ తినొద్దని సూచిస్తుంటారు. అవి తింటే జ్వరం మరింత తీవ్రమవుతుందని, త్వరగా కోలుకోరని, ఇతర జబ్బులు కూడా వస్తాయని చెప్తుంటారు. కానీ.. అందులో ఏమాత్రం వాస్తవం లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జ్వరం వచ్చినప్పుడు నాన్-వెజ్ తినాలని ఉంటే.. వాటిని నిర్భయంగా తినొచ్చని చెప్తున్నారు. ఎందుకంటే.. వాటిని తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. శరీరానికి కావాల్సిన కార్పొహైడ్రేట్స్‌తో పాటు ప్రొటీన్స్ అందుతాయి. నాన్ వెజ్‌లో ఆరోగ్యకరమైన ప్రొటీన్లు, సంతృప్తికర ఆమ్లాలు, విటమిన్లు B6, B12, జింక్, సెలీనియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాబట్టి.. నాన్-వెజ్ తినడం వల్ల లాభమే కానీ, నష్టం ఉండదని వాళ్లు పేర్కొంటున్నారు.
కాకపోతే.. నాన్-వెజ్ ఐటమ్స్ అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. అప్పుడు చికాకు, అజీర్తి వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కొందరికి వికారం, వాంతులు కూడా అవుతుంటాయి. అలాంటి వారు ఈ నాన్-వెజ్‌కి దూరంగా ఉంటే బెటర్. అలాగే.. మసాలా, కారం కూడా తగ్గించుకోవాలి. వెజిటేరియన్ ఫుడ్‌నే ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు వెల్లడిస్తున్నారు. మరీ ముఖ్యంగా.. తేలికగా జీర్ణమయ్యే ఆహారాల్ని తీసుకుంటే, త్వరగా డైజెస్ట్ అవుతుంది. అజీర్తి వంటి సమస్యలు తలెత్తవు. తక్షణమే శరీరానికి శక్తి అందుతుంది. మరీ బలహీనంగా ఉండే వారు.. న్యూట్రియంట్స్ ఉండే బ్యాలెన్స్డ్ ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అలా తీసుకుంటే, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నీరసం తగ్గి.. మళ్లీ తిరిగి శక్తివంతులౌతారు. సూప్స్, కొబ్బరి నీళ్లు, మజ్జిగలతో పాటు జామ, బొప్పాయి, నారింజ, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ లాంటి పండ్లు తీసుకుంటే.. వాటిలో ఉండే విటమిన్లు రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఇన్‌ఫెక్షన్లను తట్టుకునేలా చూస్తాయి. పాలు, పెసర, మొలకెత్తిన గింజలు, కందిపప్పు లాంటి ఆహారాలు.. జ్వరం వచ్చిన సమయంలో తీసుకుంటే శరీరంలో ప్రోటీన్లు పెరుగుతాయి.