Can Beer Damage Your Kidneys: బీర్ తాగితే కిడ్నీలకు ఎలాంటి నష్టం జరగదని చాలామంది అనుకుంటారు. కానీ ఆ అభిప్రాయం తప్పు అని ఓ పరిశోధన తేల్చింది. మద్యం తాగడం వల్ల లివర్ (Liver) ఆరోగ్యమే కాదు, కిడ్నీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. బీర్, స్పిరిట్స్ (Spirits) అంటే విస్కీ (Whisky), రమ్ (Rum), వోడ్కా (Vodka) లాంటివి తాగేవారిలో అక్యూట్ కిడ్నీ ఇంజరీ (AKI) వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. అయితే బీర్‌తో పోలిస్తే వైన్ (Wine) తాగేవారిలో ఈ ప్రమాదం తక్కువగా కనిపించింది. ఈ అధ్యయనాన్ని బ్రిటన్‌లోని ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ (Anglia Ruskin University) శాస్త్రవేత్తలు చేశారు. ఈ వివరాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ (Scientific Reports) అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మద్యం అలవాటు ఉన్న 2,50,791 మంది ఆరోగ్య డేటాను యూకే బయోబ్యాంక్ (UK Biobank) ద్వారా పరిశీలించారు. సగటున 14 ఏళ్ల పాటు వీరి ఆరోగ్యాన్ని గమనించగా, ఆ కాలంలో 10,335 మందికి అక్యూట్ కిడ్నీ ఇంజరీ సమస్య వచ్చింది.
వారానికి కేవలం ఒక్క యూనిట్ స్పిరిట్స్ తాగేవారితో పోలిస్తే, వారానికి సుమారు 9 యూనిట్లు తాగేవారిలో కిడ్నీ సమస్య వచ్చే ప్రమాదం దాదాపు 26 శాతం ఎక్కువగా ఉందని తేలింది. అలాగే వారానికి 3 యూనిట్ల బీర్ తాగేవారితో పోలిస్తే, 27 యూనిట్లు తాగేవారిలో ముప్పు 15 శాతం అధికంగా ఉంది. అంటే బీర్ లేదా స్పిరిట్స్ ఎక్కువగా తాగేకొద్దీ కిడ్నీ సమస్యల రిస్క్ కూడా అంతే పెరుగుతుందని అర్థమైంది. రక్తంలోని వ్యర్థాలను, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపడం కిడ్నీల ప్రధాన పని. బీర్ లేదా విస్కీ, రమ్, వోడ్కా వంటి మద్యం ఎక్కువగా తీసుకుంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం వల్ల డీహైడ్రేషన్ (Dehydration) ఏర్పడుతుంది. దీనితో పాటు బీర్, స్పిరిట్స్ ఎక్కువగా తాగడం వల్ల ఒంట్లో వాపులు పెరిగే అవకాశం ఉందని, ఇది కిడ్నీలకు చాలా ప్రమాదకరమని పరిశోధనలో తేలింది.
అక్యూట్ కిడ్నీ ఇంజరీ లేదా ఏకేఐ (AKI) అనేది కిడ్నీలు అకస్మాత్తుగా సరిగ్గా పనిచేయడం ఆపేసే పరిస్థితి. దీనివల్ల రక్తాన్ని శుభ్రం చేసే శక్తి తగ్గిపోతుంది. మూత్రం తక్కువగా రావడం, వాంతులు, విపరీతమైన నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో డయాలసిస్ (Dialysis) చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. వైన్ బీర్ కంటే తక్కువ ప్రమాదకరంగా కనిపించినప్పటికీ, అది కిడ్నీలకు మంచిదని మాత్రం చెప్పలేం. వైన్ తాగడం వల్ల కిడ్నీ రిస్క్ పెరిగినట్టు స్పష్టమైన ఆధారాలు కనిపించలేదంతే. వైన్ తాగేవారి జీవనశైలి, ఆహారపు అలవాట్లు మిగతా వారితో పోలిస్తే వేరేలా ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి వైన్ తాగితే కిడ్నీలు ఫిట్‌గా ఉంటాయని లేదా ఎవరైనా దీన్ని తాగాలని ఈ అధ్యయనం చెప్పడం లేదు.

