NTV Telugu Site icon

Copper Vessel: మీరు రాగి పాత్రలో నీరు తాగుతున్నారా..? ఇవి మర్చిపోతే అంతే..!

Copper Vessel

Copper Vessel

Copper Vessel: ఆరోగ్యంగా ఉండాలంటే.. మంచి ఆహారంతో పాటు నీటిని ఎక్కువగా తీసుకోవాలి.. వ్యయామం చేయాలి.. ఈ భూమి మీద జీవాన్ని నిలబెట్టడానికి నీరు అత్యంత ముఖ్యమైన అంశం. మానవ శరీరంలో 70 శాతం నీటితో నిర్మితమైంది. ఈ విషయం మీకు తెలియకపోవచ్చు.. కానీ, పురాతన కాలంలో మన పూర్వీకులు మరియు అమ్మమ్మలు కూడా రాగితో చేసిన పాత్రలలో నీటిని నిల్వ చేసే పద్ధతిని అనుసరించారు. వారి లక్ష్యం బహుశా త్రాగునీటిని రక్షించడమే. కానీ, దీనికి వెనుక ఆరోగ్యం దాగి ఉందని చెప్పాలి.. నేటి ఆధునిక ప్రపంచంలో నీటిని శుద్ధి చేయడానికి యూవీ ఫిల్టర్‌లు మరియు ఆర్‌వో ప్యూరిఫైయర్‌లను కలిగి ఉన్నందున, మెటల్ కంటైనర్‌లలో నీటిని నిల్వ చేయడం పాత పద్ధతిగా అనిపించవచ్చు.. ఇప్పుడు ఏ పాత్రలో నీరు తాగాలి అనేది కూడా కీలకంగా మారింది.. రాగి పాత్రలోని నీరు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. రాగి పాత్రలోని పోషకాలు నీటిలోకి చేరి.. అవి శరీరంలోని ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాతో పోరాడి ఎలాంటి అనారోగ్య సమస్యలు మీ జోలికి రాకుండా చేస్తాయి.. రాగిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండడంతో.. ఆ పాత్రల్లో ఉంచిన నీరు తాగడం వల్ల.. లివర్‌, కిడ్నీల పనితీరు మెరుగుపడి శరీరంలోని వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయి..

ఆయుర్వేదం ప్రకారం, రాగితో సమృద్ధిగా ఉన్న నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మూడు దోషాలను సమతుల్యం చేస్తుంది. ఇది వివిధ అవయవాలు మరియు అనేక జీవక్రియ ప్రక్రియల సరైన పనితీరును కూడా నిర్ధారిస్తుంది. అయితే, రాగి పాత్రలోని నీరు తాగితే కలిగే ప్రయోజనాలే కాదు.. వాటితో వచ్చే ప్రమాదాలను కూడా తెలుసుకోవడం మంచిది అంటున్నారు వైద్య నిపుణులు.. ప్రముఖ పోషకాహార నిపుణురాలు కిరణ్ కుక్రేజా.. రాగి బాటిల్‌ లేదా పాత్రలో ఉంచిన నీటిని సరైన పద్ధతిలో తాగాలని.. అప్పుడే అది శరీరానికి మేలు చేస్తుందంటున్నారు.. రాగి పాత్రలో నీరు తాగే అలవాటు ఉన్నవారు ఈ తప్పులు చేయొద్దు అని సూచించారు.

* మొత్తం ఆ నీటినే వాడొద్దు: రాగి పాత్రలోని నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదే.. కానీ, రోజంతా రాగి సీసాలో లేదా పాత్రలో నిల్వ ఉంచిన నీళ్లు మాత్రం తాగొద్దు.. ఎందుకంటే దాని వల్ల కాపర్‌ టక్సిసిటీ అయ్యే ప్రమాదం ఉందట.. దీని కారణంగా వికారం, మైకం, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉండడమే కాదు. లివర్‌, కిడ్నీల వైఫల్యానికి కూడా దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

* రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిలో ఇవి మిక్స్‌ చేయొద్దు: రాగి పాత్రలోని నీరు చాలా మంచిదని.. కొందరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం, తేనె కలిపిన నీళ్లు తాగేస్తున్నారు.. కానీ, రాగి పాత్ర లేదా సీసాలో నిల్వ ఉంచిన నీటిలో నిమ్మరసం, తేనె మిక్స్ చేసుకుని తాగకూడదని స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే.. నిమ్మరసంలోని యాసిడ్‌.. కాపర్‌తో రియాక్ట్‌ అవుతుంది. దీని కారణంగా.. కడుపు నొప్పి, ఎసిడిటీ, వాంతులు అవుతాయని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణురాలు.

* ప్రతీ రోజు శుభ్రం చేయొద్దు: రోజు వాడుతున్నాం కదా..! అని కాపర్‌ బాటిల్‌ అయినా.. కాపర్‌ పాత్రలు అయినా ప్రతీరోజు శుభ్రం చేయొద్దు అంటున్నారు పోషకాహార నిపుణురాలు.. దీని వాళ్ల బాటిల్‌లోని ప్రయోజనకరమైన లక్షణాలు క్రమంగా తగ్గిపోతాయని.. ప్రతీ రోజూ దానిని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుందంటున్నారు.. అయితే, నెలకొసారి ఉప్పు, నిమ్మరసం వేసి శుభ్రం చేసుకోవడం శ్రేయస్కరంగా సూచిస్తున్నారు.

 

<p style=”font-size: 10px;”><span style=”color: red;”>నోట్ :</span> ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.</p>