Weight Loss Challenge: చైనాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ అరాషి విజన్ ఇంక్. ఈ కంపెనీని ఇన్‌స్టా360 అని కూడా పిలుస్తారు. ఇది తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగులు బరువు తగ్గి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందడానికి ప్రత్యేకమైన మార్గాన్ని అవలంబించింది. ఈ కంపెనీ ఆగస్టు 12న వార్షిక ‘మిలియన్ యువాన్ వెయిట్ లాస్ ఛాలెంజ్’ను ప్రారంభించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడం చాలా సులభం. ఏ ఉద్యోగి అయినా పేరు నమోదు చేసుకోవచ్చు. ప్రతి అరకిలో బరువు తగ్గితే 500 యువాన్ల (సుమారు రూ. 6100) బోనస్ పొందుతారు.
READ MORE: Health Tips: ఈ 5 నాచురల్ ఫుడ్‌తో ప్రోటీన్ సమస్య ఇట్టే దూరం.. కరీనా కపూర్ కూడా ఇదే ఫాలో అవుతారు!
ఈ సంవత్సరం.. Gen-Z ఉద్యోగి షి యాకి 90 రోజుల్లో 20 కిలోలకు పైగా బరువు తగ్గి బరువు తగ్గించే ఛాంపియన్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆమెకు 20,000 యువాన్లు (సుమారు రూ. 2.47 లక్షలు) నగదు బహుమతి లభించింది. ఆమె తన విజయానికి క్రమశిక్షణ, ఆహారం నియంత్రణ, ప్రతిరోజూ 1.5 గంటల వ్యాయామం కారణమని చెప్పింది. ఇది తన జీవితంలో అత్యుత్తమ అవకాశమని చెప్పింది. కంపెనీకి కృతజ్ఞతలు తెలిపింది. తన సహోద్యోగులకు స్ఫూర్తినిచ్చేందుకు గ్రూప్ చాట్‌లో ‘క్విన్ హావో బరువు తగ్గించే పద్ధతి’ని పంచుకుంది. ఈ డైట్ ప్లాన్ సహాయంతో చైనీస్ నటుడు క్విన్ హావో 15 రోజుల్లో 10 కిలోలు తగ్గారు. ఇందులో ఒక రోజులో సోయా పాలు మాత్రమే తాగడం, మరొక రోజు మొక్కజొన్న లేదా పండ్లు మాత్రమే తినడం వంటి కఠినమైన నియమాలు ఉన్నాయి. కాగా.. 2022 నుంచి కంపెనీ ఈ ఛాలెంజ్‌ను ఏడుసార్లు నిర్వహించింది. దాదాపు 2 మిలియన్ యువాన్ల (సుమారు రూ. 2.47 కోట్లు) విలువైన బహుమతులను పంపిణీ చేసింది. గత ఏడాది 99 మంది ఉద్యోగులు కలిసి 950 కిలోల బరువు తగ్గారు. ఒక మిలియన్ యువాన్ బోనస్‌ను పంచుకున్నారు.
