ఇల్లు కట్టుకోవాలన్నా, కారు కొనాలన్నా ఎంతో ఆలోచించి.. పది మందిని అడిగి ఎది మంచిదో తెలుసుకొని మరి ప్లాన్ చేసుకుంటాం. మరి జీవితంలో అత్యంత మధురమైన ఘట్టమైన ‘తల్లి కావడం’ కోసం ఎందుకు అంత శ్రద్ధ తీసుకోవడం లేదు? గర్భధారణ అనేది శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ప్రిపేర్ అయి జరగాల్సిన ఒక పరిణతి. చాలా మందికి ఈ విషయంలో అవగాహన లేక ఒత్తిడికి గురవుతున్నారు. మరి తల్లయ్యే ముందు మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన ఐదు విషయాలు ఏంటో చూడండి..
1. గర్భధారణకి కనీసం 6 వారాల ముందు నుంచే సన్నద్ధం కావాలి
తల్లయ్యే ప్రయాణం సురక్షితంగా సాగాలంటే ముందస్తుగా ప్లానింగ్ చాలా అవసరం. గర్భస్రావం, శిశువులో లోపాలు వంటి అనర్థాలు ఒక చిన్న నిర్లక్ష్యం వల్లే జరిగే ప్రమాదం ఉంది. ఒక చిన్న తప్పిదం జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే, గర్భధారణకు కనీసం నెలన్నర ముందు నుంచే శరీరాన్ని, మనసును సిద్ధం చేసుకోవాలి. ఇది శిశువు ఆరోగ్యకరంగా పెరగడంలో కీలకం.
2. ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం తప్పనిసరి
గర్భధారణకు ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ సేవించడం వల్ల పుట్టబోయే శిశువులో జన్యు లోపాలు ఏర్పడే అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చు. ముఖ్యంగా, మెదడు అలాగే నర్వస్ సిస్టమ్ అభివృద్ధిలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది.
విశేషంగా చెప్పాలంటే..
* గర్భధారణకు కనీసం ఒక నెల ముందే ఫోలిక్ యాసిడ్ వాడటం ప్రారంభించాలి.
* రోజుకు సుమారు 400 మైక్రోగ్రాములు (mcg) తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు.
* ఇది తల్లి ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, శిశువు ఆరోగ్యకరమైన జీవితం కోసం కూడా మొదటి మెట్టు అని చెప్పవచ్చు.
* గర్భధారణకు ముందే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు వాడటం వల్ల జన్యులోపాలను నివారించవచ్చు. ఇది శిశువు మెదడు, నర్వస్ సిస్టమ్ అభివృద్ధికి చాలా అవసరం.
3. తగిన బరువుతోనే గర్భధారణ
గర్భధారణ సాఫీగా సాగాలంటే, తల్లిగా మారేందుకు మందు శరీర బరువు సరైన స్థాయిలో ఉండటం చాలా ముఖ్యం. బరువు తక్కువగా ఉన్నా, శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోవచ్చు. బరువు ఎక్కువగా ఉన్నా, హార్మోన్ల అసమతుల్యత, గర్భస్రావం, గెస్ట్‌నేషనల్ డయాబెటిస్, హై బీపీ వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి.. BMI (Body Mass Index) ని పరీక్షించించుకొని, ఆరోగ్యకరమైన స్థాయిలో (18.5–24.9 మధ్య) ఉంచుకోవడం మంచిది. అవసరమైతే డైట్, వ్యాయామం ద్వారా బరువు క్రమబద్ధీకరించాలి. ఇది గర్భధారణను సులభతరం చేయడమె కాదు, పుట్టబోయే శిశువు ఆరోగ్యానికీ దోహదపడుతుంది, సాధారణంగా తల్లి ఆరోగ్యం బాగుంటే, శిశువు ఆరోగ్యంగా ఎదిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
4. శారీరక, మానసిక దృఢత అవసరం
గర్భధారణ సమయంలో తల్లి అనుభవించే ప్రతి ఆలోచన, ప్రతి మార్పు శిశుపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది. కాబట్టి, తల్లి శారీరకంగా ఆరోగ్యంగా ఉండడమే కాక, మానసికంగా బలంగా ఉండటం కూడా ఎంతో కీలకం. శారీరక దృఢత్వం వల్ల గర్భధారణ సమయంలో జబ్బుల ప్రబలత తగ్గుతుంది, డెలివరీ కూడా సాఫీగా జరుగుతుంది. మానసిక దృఢత వలన ఒత్తిడి, భయం, అనవసర ఆందోళనలు కూడా తగ్గుతాయి. కానుక ధ్యానం, ప్రశాంతమైన వాతావరణం, కుటుంబ మద్దతు, మంచి ఆచారాల అలవాటు.. ఇవన్నీ మానసిక స్థైర్యాన్నికి తోడ్పడతాయి. మనం ఎలా జీవిస్తామో, ఎలాంటి ఆలోచనతో ఉన్నాం.. అది పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రతిబింబిస్తుంది. అందుకే, తల్లి ముందుగానే ఆత్మస్థైర్యంతో, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అవలంబించాలి.
5. సరి అయిన ఆహారం, వ్యాయామం తప్పనిసరి
తల్లి ఆరోగ్యం అనేది పుట్టబోయే శిశువు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అందుకే గర్భధారణకు ముందు నుంచే సమతుల ఆహారం తీసుకోవడం, నియమితమైన వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. కనుక మీరు తీసుకునే ఆహారంలో ఉండాల్సినవి.. ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, విటమిన్ B12, డి-విటమిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అలాగే ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు, చికెన్/ఎగ్స్ (నాన్ వెజిటేరియన్ లో), గుడ్డు, పప్పులు కూడా తినాలి. అలాగే ప్యాకెట్ ఫుడ్, అధిక షుగర్ లేదా ప్రాసెస్‌డ్ ఫుడ్‌ను పూర్తిగ తగ్గించాలి. ఇక తేలికపాటి వ్యాయామం (వాకింగ్, ఫ్రీ-నేటల్ యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్) శరీర ధాటిని పెంచుతుంది. ఇది గర్భధారణకు త్వరగా సహకరిస్తుంది. కాన్పు సమయంలో శ్రమ తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. కానీ వ్యాయామం మొదలు పెట్టే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
సారాంశం:
తల్లయ్యే ప్రయాణం అనేది ఒక గొప్ప బాధ్యతతో కూడిన మధురమైన ప్రయాణం. ఈ ప్రయాణాన్ని ఆరోగ్యంగా ప్రారంభించాలంటే ముందుగానే ప్రిపేర్ అవ్వడం అవసరం. చిన్న చిన్న జాగ్రత్తలతో పెద్ద అనర్థాలను నివారించవచ్చు.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
