కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న దేశవ్యాప్త నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఒక అద్భుతమైన శుభవార్తను అందించింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాల్లోని గ్రూప్ బి మరియు గ్రూప్ సి విభాగాలలో ఖాళీగా ఉన్న దాదాపు 12,256 ఉద్యోగాల భర్తీ కోసం ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ (SSC CGL) 2026 అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన గ్రాడ్యుయేట్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఈ భారీ నియామక ప్రక్రియ ద్వారా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్, ఆడిటర్, అకౌంటెంట్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వంటి ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం ప్రకటించిన 12,000 పైచిలుకు పోస్టుల సంఖ్య తాత్కాలికమేనని, కేటగిరీల వారీగా మరియు పోస్టుల వారీగా పూర్తి వివరాలను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతామని కమిషన్ స్పష్టం చేసింది.
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 21, 2026 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 22, 2026 రాత్రి 11 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుమును చెల్లించడానికి జూన్ 23, 2026 రాత్రి 11 గంటల వరకు సమయం ఇచ్చారు. ఒకవేళ అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లో ఏవైనా తప్పులు చేసి ఉంటే, వాటిని సరిదిద్దుకోవడానికి జూన్ 29 నుండి జూలై 1, 2026 వరకు కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది.
పరీక్షల విషయానికి వస్తే.. మొదటి దశ కంప్యూటర్ ఆధారిత టైర్-1 (Tier-I) పరీక్షలను 2026 ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల మధ్య నిర్వహిస్తారు. ఈ మొదటి దశలో అర్హత సాధించిన అభ్యర్థులకు 2026 డిసెంబర్ నెలలో టైర్-2 (Tier-II) పరీక్షలను నిర్వహించేందుకు కమిషన్ తాత్కాలికంగా ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ముందుగా ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి.. హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ 2026 అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోని వారు వన్-టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వ్యక్తిగత, విద్యా, కమ్యూనికేషన్ వివరాలను ఎంతో జాగ్రత్తగా నమోదు చేయాలి. అనంతరం అభ్యర్థి ఫోటో, సంతకంతో కూడిన స్కాన్ చేసిన పత్రాలను అప్‌లోడ్ చేసి, ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు రుసుమును చెల్లించాలి.
చివరగా అప్లికేషన్‌ను సమర్పించి, భవిష్యత్తు అవసరాల కోసం కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. అభ్యర్థులు దరఖాస్తును సమర్పించే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న వయోపరిమితి, విద్యా అర్హతలు , పరీక్షా నిబంధనలను క్షుణ్ణంగా చదివి.. తాము అన్ని అర్హతలను కలిగి ఉన్నామో లేదో సరిచూసుకోవాలని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సూచించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన పోస్టులు , భారీ సంఖ్యలో ఖాళీలు ఉండటంతో ఈ ఏడాది దేశవ్యాప్తంగా గ్రాడ్యుయేట్ల నుంచి ఈ పరీక్షకు విపరీతమైన పోటీ ఉండే అవకాశం ఉంది.
