అమెరికాకు చెందిన నెట్‌వర్కింగ్ దిగ్గజం సిస్కో సిస్టమ్స్ (Cisco Systems) తన వ్యాపార వ్యూహాల్లో సమూల మార్పులు చేపడుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. సాంకేతిక రంగంలో ప్రస్తుతం నెలకొన్న తీవ్ర పోటీని తట్టుకోవడానికి, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి నూతన ఆవిష్కరణల వైపు మళ్లేందుకు సంస్థ తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో భారీ కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు 4,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ సంస్థ సీఈఓ చక్ రాబిన్స్ ఉద్యోగులకు మెమో పంపారు. రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నప్పటికీ, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వ్యయ నియంత్రణ, పెట్టుబడుల పునర్విభజన తప్పనిసరి అని కంపెనీ భావిస్తోంది. ఈ చర్యతో సిస్కో కూడా మెటా, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాల బాటలోనే పయనించినట్లయింది.
సిస్కో తన మూడో త్రైమాసికంలో (Q3) అనూహ్య వృద్ధిని సాధించింది. గత ఏడాదితో పోలిస్తే 12 శాతం వృద్ధితో 15.8 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. అయినప్పటికీ.. AI యుగంలో విజేతగా నిలవాలంటే కంపెనీ తన పెట్టుబడులను డిమాండ్ ఉన్న రంగాల వైపు మళ్లించాలని, అందుకోసం నిర్దిష్ట విభాగాల్లో సిబ్బందిని తగ్గించడం అవసరమని యాజమాన్యం స్పష్టం చేసింది.
ఎవరు ప్రభావితమవుతారు..?
మొత్తం 80,000 మంది గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో సుమారు 5 శాతం లోపు సిబ్బందిపై ఈ ప్రభావం పడనుంది. మే 14 నుంచే ప్రభావిత ఉద్యోగులకు సమాచారం అందించడం ప్రారంభించారు. ఏయే విభాగాలు ఎక్కువగా నష్టపోతాయనేది స్పష్టంగా వెల్లడించనప్పటికీ, కంపెనీ నిర్మాణాత్మక మార్పుల్లో భాగంగా ఈ కోతలు జరుగుతున్నాయి.
తొలగింపునకు కారణాలు..
కేవలం ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా, సిలికాన్, ఆప్టిక్స్, క్లౌడ్ సెక్యూరిటీ, సిబ్బంది మధ్య AI వినియోగాన్ని పెంచడం వంటి కీలక వ్యూహాత్మక రంగాలపై దృష్టి పెట్టడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. భవిష్యత్తు వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ వనరులను తిరిగి కేటాయించాలని సిస్కో భావిస్తోంది.
బాధితులకు భరోసా..
లేఆఫ్స్‌కు గురైన వారికి అండగా నిలిచేందుకు సిస్కో 1 బిలియన్ డాలర్ల నిధిని కేటాయించింది. దీని ద్వారా బాధితులకు కొన్ని ప్రయోజనాలు కల్పిస్తారు. వాటిలో ముఖ్యంగా.. ప్రో-రేటా ప్రాతిపదికన బోనస్ చెల్లింపులు, సెవరెన్స్ పేమెంట్స్ మరియు ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. అంతే కాకుండా.. కొత్త ఉద్యోగాల అన్వేషణకు ప్లేస్‌మెంట్ సర్వీస్ కల్పించడం జరుగుతుంది. వీటితో పాటే.. ఏడాది పాటు ఉచితంగా కోర్సులను అందించనున్నారు. ఈ మార్పులు తాత్కాలికంగా కష్టంగా ఉన్నప్పటికీ.. కంపెనీని దీర్ఘకాలికంగా బలోపేతం చేస్తాయని సీఈఓ చక్ రాబిన్స్ విశ్వాసం వ్యక్తం చేశారు.
