Zakir Naik Lands in Qatar For Fifa World Cup Turns Controversy: ముస్లిం మత ప్రబోధకుడు జాకిర్ నాయక్ గుర్తున్నాడా? మనీ లాండరింగ్‌తో పాటు విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నాడని ఆరోపణలు రావడంతో.. ఇండియా నుంచి పారిపోయాడు. 2016లో కేంద్రం ఆయనపై నిషేధం కూడా విధించింది. ఇప్పుడు ఆయన ఫిఫా వరల్డ్‌కప్ కోసం ఖతార్‌లో కాలుమోపాడు. ఖతార్‌కి రావాలని, ఫిఫా వరల్డ్‌కప్ సందర్భంగా ఇస్లాం బోధనలు చేయాలని అక్కడి ప్రభుత్వం ఆహ్వానించడంతో.. ఆయన అక్కడ ల్యాండ్ అయ్యాడు. టోర్నీ జరిగేంతకాలం.. అక్కడి ప్రభుత్వం నిర్వహించబోయే మత సంబంధమైన కార్యక్రమాల్లో జాకిర్ పాల్లొంటాడు. మత బోధనలు ఇవ్వనున్నాడు.
అయితే.. ఈ విషయంలో మన భారతీయులు తీవ్రంగా మండిపడుతున్నారు. గతంలో ఇస్లాంకు వ్యతిరేకంగా నుపుర్ శర్మ వ్యాఖ్యలు చేసిందంటూ.. ఖతార్ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే! ఆమె వ్యాఖ్యలపై భారత్ వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. అలాంటి ఖతార్.. ఇప్పుడు భారత్ నిషేధించిన జాకిర్‌ను ఆహ్వానించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నుపుర్ శర్మ విషయంలో కఠినంగా వ్యవహరించిన ఖతార్.. భారత్ బ్యాన్ చేసిన జాకిర్ నాయక్‌ని ఆహ్వానించడం సిగ్గుచేటు అంటూ ఫైర్ అవుతున్నారు. జాకిర్ నాయక్ ఒక టెర్రరిస్ట్ అని, అతడ్ని తీసుకొచ్చి ఫిఫా వరల్డ్‌కప్ క్రీడకు మచ్చ తెచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం నెటిజన్లే కాదండోయ్.. టీవీల్లో భారీ డిబేట్లే నడుస్తున్నాయి. జాకిర్ నాయక్‌ను ఫిఫా వరల్డ్‌కప్ నుంచి బహిష్కరించాల్సిందిగా డిమాండ్లు చేస్తున్నారు. జాకిర్‌ని పిలిచి.. ఖతార్ తన ద్వంద్వ వైఖరిని బయటపెట్టిందంటూ ధ్వజమెత్తుతున్నారు.
కాగా.. జాకిర్ నాయక్‌పై మనీ లాండరింగ్‌తోపాటు విద్వేష పూరిత ప్రసంగాలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. మత బోధనల పేరుతో యువతను రెచ్చగొట్టడం, హింసవైపు నడిపించడంతో పాటు ఆర్థికపరమైన అక్రమాలకు పాల్పడినట్లు ఆయనపై కొన్ని కేసులున్నాయి. కేంద్రం కూడా.. జాకిర్ బోధనల ద్వారా ఎంతోమంది యువత తప్పుడుబాట పడుతున్నట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆయనపై 2016లో కేంద్రం నిషేధం విధించింది. అప్పుడు దేశం విడిచి పారిపోయిన ఆయన.. ప్రస్తుతం మలేషియాలో ఉంటున్నాడు.
