Yvetti Cooper Fires On Rishi Sunak: బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రిషి సునాక్ తన మంత్రివర్గంలో కీలక మార్పులు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన.. ఇటీవల బ్రిటన్ హోం సెక్రెటరీ పదవికి రాజీనామా చేసిన సుయెల్లా బ్రేవర్మన్‌ను తిరిగి అదే స్థానంలోకి తీసుకున్నారు. అయితే.. రిషి తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైగ్రేషన్‌కు సంబంధించిన వ్యవహారంలో బ్రేవర్మన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని, అలాంటి ఆమెను మళ్లీ అదే పదవిలోకి ఎలా తీసుకుంటారని ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీ వైవెట్టీ కూపర్ నిలదీశారు. దేశభద్రతకు బాధ్యత వహించే కీలక పదవిలో ఆమెను కూర్చోబెట్టడం సమంజసం కాదని, రిషి తీసుకున్న నిర్ణయం లోపం కనిపిస్తోందని ఆరోపించారు. ‘‘బ్రేవర్మన్‌ను తిరిగి బ్రిటన్ హోం సెక్రటరీ పదవిలోకి తీసుకోవడం.. రిషి సునాక్ తీసుకున్న నిర్ణయంలో భారీ తప్పిదం కనిపిస్తోంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, దేశభద్రత కూడా ముఖ్యమని ప్రధాని గుర్తించాలి’’ అని కూపర్ సీరియస్‌గా స్పందించారు.
అంతకుముందు.. అదే లేబర్ పార్టీకి చెందిన కీర్ స్టార్మర్‌తో పాటు బ్రిడ్జెట్ ఫిలిప్సన్ నేతలు బ్రేవర్మన్ నియామకాన్ని తప్పు పట్టారు. డెమొక్రాట్లు కూడా బ్రేవర్మన్ నియామకంపై క్యాబినెట్ కార్యాలయం స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేసింది. అప్పుడు రిషి సునాక్.. ‘‘తాను చేసిన పొరపాటుని గుర్తించి, బ్రేవర్మన్ పదవి నుంచి తప్పుకొన్నారు. కాబట్టి ఆమెను తిరిగి ఉమ్మడి మంత్రివర్గంలోకి నేను స్వాగతించాను. ఆమె రాకతో మంత్రివర్గానికి స్థిరత్వం చేకూరింది’’ అని తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. కాగా.. మాజీ ప్రధాని లిజ్ ట్రస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో హోం సెక్రటరీగా బ్రేవర్మన్ బాధ్యతలు నిర్వహించినప్పుడు, మైగ్రేషన్‌కు సంబంధించిన అధికారిక పత్రాలను తన వ్యక్తిగత ఈమెయిల్ నుంచి సహచర ఎంపీలకు పంపించారు. అప్పట్లో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఆమె నిబంధనల్ని ఉల్లంఘించారని విమర్శలు వచ్చాయి. దీంతో.. ఆమె తన పదవి నుంచి వైదొలిగారు. ఇప్పుడు రిషి సునాక్ మళ్లీ ఆమెని అదే స్థానంలో నియమించడంతో.. విమర్శలు చెలరేగుతున్నాయి.