Site icon NTV Telugu

COVID 19: ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా వార్నింగ్..

తగ్గినట్టే తగ్గిన కరోనా మహమ్మారి.. మళ్లీ పంజా విసురుతోంది.. ఆసియా ఖండంతో పాటు యూరోప్‌ దేశాల్లో కరోనా విజృంభిస్తుండటం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ప్రపంచ దేశాలను మరోసారి అలెర్ట్‌ చేసింది. కరోనా ఇంకా చాలా దృఢంగానే ఉందని వైరస్‌ సులభంగానే వ్యాపిస్తోందని వెల్లడించింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తగ్గుముఖం పట్టడంతో వ్యాప్తి విస్తృతమవుతున్నట్లు తెలిపింది. వైరస్ ఇంకా పూర్తిగా క్షీణించలేదని, సీజనల్‌ వ్యాధిలా మారలేదని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర విభాగాధిపతి డాక్టర్ మైక్ ర్యాన్‌ స్పష్టం చేశారు. మరో ఏడాదిపాటు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని.. లేదంటే కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. యూకే, దక్షిణ కొరియా దేశాల్లో పెరుగుతున్న కేసుల కారణంగా మనమంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read Also: ICC Women’s World Cup: భారత్‌ కీలక మ్యాచ్‌.. బ్యాటింగ్‌ స్టార్ట్..

వ్యాక్సిన్ల శక్తి తగ్గిపోయి, రోగనిరోధక శక్తి క్షీణిస్తుండటంతో వైరస్ ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తోందని డాక్టర్ మైక్ ర్యాన్‌ వెల్లడించారు. వైరస్‌ ఇంకా ఎంతో ధృడంగా ఉన్నట్లు నిపుణులు ధ్రువీకరించారని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా ప్రబలి.. మళ్లీ అక్కడి నుంచి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న ప్రాంతానికి వ్యాపిస్తుందన్నారు. కట్టడి చర్యలు లేకపోతే మరింత ఉత్పరివర్తనం చెందుతుందన్నారు. కొత్త వేరియంట్లు పుట్టుకువచ్చే అవకాశాలు చాలా ఉన్నాయని మైక్ ర్యాన్‌ వివరించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉందని ఇటీవలే డబ్ల్యూహెచ్‌ఓ ఎపిడెమిలాజిస్ట్‌ మరియా వాన్‌ ఖెర్ఖోవ్‌ స్పష్టం చేశారు. స్వల్ప విరామం తర్వాత వైరస్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయన్నారు. కరోనా నిబంధనలు తొలగించిన ప్రాంతాల్లో వైరస్ తిరగబడుతోందన్నారు. పరీక్షల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ..కేసులు పెరుగుతున్నాయని తెలిపారు.

Exit mobile version