కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ దూసుకుపోతున్న వేళ.. డబ్ల్యూహెచ్‌వో ప్రశంసలు కురిపించింది. ప్రపంచంలో 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. దీంతో భారత్‌ను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ అభినందించారు. 100 కోట్ల డోసులను పంపిణీ చేసి భారత్ చరిత్ర లిఖించిందంటూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌ను టెడ్రోస్ అథనోమ్ రీట్వీట్ చేశారు. కరోనా వైరస్ ముప్పు పొంచి ఉన్న వేళ ప్రజలను రక్షించడంతో పాటు వ్యాక్సిన్ సమానత్వ లక్ష్యాలను సాధించేందుకు భారత్ చేసిన ప్రయత్నాలపై ఆయన ప్రశంసించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ 100 కోట్ల మైలురాయిని దాటినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
Read Also : పాక్‌లో మరో కొత్త వేరియంట్
మరోవైపు భారత్ సాధించిన ఘనతపై ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ కూడా అభినందనలు తెలిపారు. దేశంలోని వైద్య ఆరోగ్య వ్యవస్థ, ప్రజల కృషి, వివిధ రంగాల మధ్య సమన్వయం వల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. కాగా ఈ చారిత్రక ఘట్టంలో భాగస్వాములం అయినందుకు భారత్ బయోటెక్, సీరం సంస్థల ప్రతినిధులు గర్వంగా ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే ఈ రికార్డు సాధ్యమైందని వారు అభిప్రాయపడ్డారు.