WHO Looking To Rename Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దాని విస్తరణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 93 దేశాల్లో 36,589 కేసులు నమోదు అయ్యాయి. ఇండియాలో కూడా వ్యాధి బయటపడింది. కేరళ త్రిస్సూర్ కు చెందిన ఓ యువకుడు మంకీపాక్స్ తో మరణించాడు. ప్రస్తుతం ఇండియాలో మొత్తం 9 మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ వ్యాధి పేరును మార్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) భావిస్తోంది.
ఈ వ్యాధి పేరును మార్చాలనే ఉద్దేశంతో ప్రజల్ని సలహాలను కోరింది డబ్ల్యూహెచ్ఓ. ఈ వ్యాధికి మంకీపాక్స్ అనే పేరు ఉండటంతో కోతుల వల్ల వ్యాపిస్తుందనే ప్రచారం జరుగుతోంది.ఇటీవల బ్రెజిల్ దేశంలో వ్యాధి భయంతో కోతులపై ప్రజలు దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇందుచేతనే ఈ వ్యాధి పేరును మార్చాలని భావిస్తోంది డబ్ల్యూహెచ్ఓ. కోతులు, చింపాజీలు ఇతర జంతువుల పేర్లు లేకుండా.. వాటికి నిందను ఆపాదించకుండా కొత్త పేరును పెట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం పేరు మార్పు కోసం డబ్ల్యూహెచ్ఓ ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ కూడా ప్రారంభించి.. వ్యాధి పేరు విషయంలో ప్రజల సలహాలను అడుగుతోంది.
Read Also: Super Vasuki Train: ఆరు ఇంజిన్‌లు.. 295 బోగీలు.. దేశంలో అతి పెద్ద పొడవైన రైలు ఇదే..!!
1958లో డెన్మార్క్ లో పరిశోధన కోసం ఉంచిన కోతుల్లో ఈ వైరస్ గుర్తించడం వల్ల ‘మంకీపాక్స్’ పేరు పెట్టారు. అప్పటి నుంచి దీన్ని ఇలాగే వ్యవహరిస్తున్నారు. చాలా తరుచుగా ఈ వ్యాధిని ఎలుకల్లో కనుక్కుంటున్నారు. ఈ వ్యాధి మొదటిసారిగా 1970లో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో కనుక్కున్నారు. అప్పటి నుంచి ఈ వ్యాధి ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లోనే ఉంది. అయితే ఈ ఏడాది మే నెలలో బ్రిటన్ లో మొదలైన మంకీపాక్స్ కేసులు 30 వేలను దాటాయి. ప్రపంచ వ్యాప్తంగా 12 మంది మరణించారు. సాధారణంగా వైరస్ మశూచి లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే సాధారణంగా మనకు ఉండే రోగ నిరోధక వ్యవస్థ.. రెండు వారాల నుంచి నెల వ్యవధిలో వ్యాధి నుంచి కోలుకునేలా సహకరిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లోనే ఈ వ్యాధి ప్రమాదకరంగా ప్రాణాల మీదకు తెస్తుంది. ఎక్కువగా స్వలింగ సంపర్కుల్లో ఈ వ్యాధి వ్యాపిస్తోంది.
