NTV Telugu Site icon

Alawites: అలవైట్లు ఎవరు..? సిరియాలో ఎందుకు వీరిని వేటాడి చంపుతున్నారు..

Alawites

Alawites

Alawites: సిరియా నుంచి బషర్ అల్ అసద్ పారిపోయిన తర్వాత, అక్కడ అధికారాన్ని హయత్ తహ్రీర్ అల్ షామ్(HTS) చేజిక్కించుకుంది. సున్నీ తీవ్రవాద సంస్థ అయిన హెచ్‌టీఎస్ తిరుగుబాటు కారణంగా బషర్ అల్ అసద్ దేశం వదిలి రష్యా వెళ్లిపోయాడు. అయితే, అప్పటి నుంచి సిరియాలో మారణహోమం కొనసాగుతూనే ఉంది. సాయుధ సున్నీ వర్గాలు, అలవైట్లపై ప్రతీకార దాడులకు తెగబడుతున్నారు. దశాబ్ధాలుగా అలవైట్లు అస్సాద్‌కి మద్దతుగా ఉన్నారు. దీంతో ఇప్పుడు వీరిని ఊచకోత కోస్తున్నారు. అలవైట్ల గ్రామాల్లోకి దుండగులు చొరబడి హత్య చేస్తున్నారు. ముఖ్యంగా పురుషులను వేటాడి వెంటాడి చంపుతున్నారు.

ఈ దాడుల్లో ఇప్పటి వరకు 1000 మందికి పైగా మరణించారు. సిరియాలో చాలా చోట్ల వీరి మృతదేహాలు నగ్నంగా పడి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బనియాస్ పట్టణంలో అత్యంత క్రూరమైన దాడులు జరిగాయి. వీధుల్లో చెల్లాచెదురుకాగా మృతదేహాలు పడి ఉన్నాయి. కొంత మందిని వారి ఇళ్లలో, వ్యాపార స్థలాల్లోనే ఉరితీశారు. 14 సంవత్సరాల క్రితం సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి జరిగిన అత్యంత దారుణమైన హింస ఇది.

బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ (SOHR) ప్రకారం.. 745 మంది పౌరులు అతి దగ్గర నుంచి కాల్చి చంపబడ్డారు. మరో 125 మంది ప్రభుత్వ సిబ్బంది, అసద్ అనుబంధ సాయుధ గ్రూపులతో సంబంధం ఉన్న 148 మంది ఉగ్రవాదులు కూడా మరణించారు. అసద్ బలమైన కోటగా ఉన్న లటాకియా ప్రావిన్స్‌లో కనీసం 162 మంది అలావైట్లకు మరణశిక్షలు అమలు చేశారని నివేదికలు వెల్లడించాయి.

Read Also: Olive Ridley Turtles: 33 ఏళ్ల తర్వాత ఒడిశా బీచ్‌లో కనిపించిన అంతరించిపోతున్న తాబేళ్లు..

ఎవరు ఈ అలవైట్లు:

సిరియా జానాభాలో అలవైట్లు మతపరమైన మైనారిటీలుగా ఉన్నారు. జనాభాలో వీరు దాదాపుగా 12 శాతం ఉన్నారు. షియా ఇస్లాం నుంచి ఉద్భవించిన వీరికి ప్రత్యేకమైన నమ్మకాలు, ఆచారాలు ఉంటాయి. చారిత్రాత్మకంగా అలావైట్లు సిరియా తీర ప్రాంతాల్లో, ముఖ్యంగా లటాకియా, టార్టస్ ప్రావిన్సుల్లో ఉన్నారు.

డిసెంబర్ 2024లో సిరియాను 5 దశాబ్దాలుగా పాలించిన అసద్ కుటుంబం గద్దె దిగింది. వీరు అలవైట్ల శాఖకు చెందినవారు. వారి పాలనలో మైనారిటీలుగా ఉన్న అలావైట్లు ప్రభుత్వంలో, సైన్యంలో కీలక పదవులు అందుకున్నారు. ఇదే అక్కడ సున్నీలకు, అలవైట్లకు మధ్య ఘర్షణకు కారణమైంది.

ఎందుకు ఈ ఊచకోత:

అస్సాద్ పదవీచ్యుతుడైన తర్వాత, కొత్త ప్రభుత్వానికి విధేయులుగా చెప్పబడుతున్న సాయుధ సున్నీ వర్గాలు, అలావైట్లపై ప్రతీకార హత్యలను ప్రారంభించాయి. ఇది సిరియాలో మతపరమైన విభజనను తీవ్రం చేసింది. దశాబ్దాలుగా, వీరు అస్సాద్ ప్రభుత్వానికి మద్దతుదారులుగా ఉన్నారు. అందుకే వీరిపై ప్రతీకార దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ హత్యలపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. ఫ్రాన్స్ ఈ హింసపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఫ్రెంచ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సిరియా తాత్కాలిక ప్రభుత్వాన్ని సామూహిక హత్యలపై స్వతంత్ర దర్యాప్తు జరిగేలా చూడాలని కోరింది.