Site icon NTV Telugu

Venezuela: “15 నిమిషాలే టైమ్ ఇచ్చారు, లేదంటే చంపేస్తామన్నారు”.. యూఎస్ దాడిపై వెనిజులా ప్రెసిడెంట్..

Delcy Rodriguez

Delcy Rodriguez

Venezuela: వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ అమెరికా దాడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బందీలుగా పట్టుకున్న ఈ ఆపరేషన్‌ గురించి కీలక విషయాలు వెల్లడించారు. అమెరికన్ దళాలు తమ మంత్రి వర్గ సభ్యులు అమెరికా డిమాండ్లకు ఒప్పుకుంటారా? లేదా చంపేయమంటారా.? అని నిర్ణయం తీసుకోవడానికి 15 నిమిషాలు సమయం ఇచ్చారని అన్నారు.

‘‘వారు(అమెరికా) అధ్యక్షుడు(మదురో)ను కిడ్నాప్ చేసిన మొదటి నిమిషం నుంచే బెదిరింపులు ప్రారంభమయ్యాయి. డియోస్డాడో (అంతర్గత మంత్రి), జార్జ్ రోడ్రిగెస్, నాకు స్పందించడానికి 15 నిమిషాలు సమయం ఇచ్చారు. లేదంటే మమ్మల్ని చంపుతామని అన్నారు’’ అని డెల్సీ రోడ్రిగెస్ చెప్పారు. అమెరికా దాడి జరిగిన 7 రోజలు తర్వాత వెనిజులాలో జరిగిన 2 గంటల సమావేశానికి సంబంధించిన వీడియో రికార్డింగ్‌లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన ప్రధాన లక్ష్యం రాజకీయ అధికారాన్ని కాపాడుకోవడమే అని ఆమె అన్నారు. అమెరికా బలగాలు మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను హత్య చేశామని చెప్పారని ఆమె వెల్లడించారు.

Read Also: Union Budget 2026: యుద్ధాలు, డబ్బులు, క్లైమేట్ ఛేంజ్.. బడ్జెట్ నుంచి Gen-Z ఏం ఆశిస్తోంది?

ఇదిలా ఉంటే, మదురో అరెస్ట్ ముందు రోడ్రిగ్జ్, ఆమె సోదరులు, అధ్యక్షుడు ట్రంప్‌కు సహకరించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో తమపై దేశద్రోహ ముద్ర పడుతుందనే భయం వారిలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. తన ఆదేశాలను రోడ్రిగ్జ్ పాటిస్తుందని ట్రంప్ ప్రశంసించారు. అయితే, ఆమె మాత్రం ఇది నిరంతర బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ కారణంగా తీసుకున్న నిర్ణయం అని చెబుతున్నారు.

రాజకీయ విశ్లేషకులు మాత్రం మదురో తొలగింపు అంతర్గత సహకారంతో జరిగిందని చెబుతున్నారు. మదురో పట్టుబడినప్పటి నుంచి వెనిజులా ప్రభుత్వం అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడింది కానీ ట్రంప్ డిమాండ్లు అన్నింటిని అంగీకరించింది. మదురో స్థానంలో అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు తీసుకున్న రోడ్రిగెస్ కూడా ట్రంప్‌కు మద్దతు ఇచ్చి, వెనిజులా చమురును అమెరికాకు అందుబాటులో ఉంచారు. ఇటీవల మరోసారి ట్రంప్ మాట్లాడుతూ.. రోడ్రిగ్జ్ నాయకత్వం బలంగా ఉందని, వెనిజులా ముడి చమురులో వాటా తీసుకున్న తర్వాత అమెరికా మరింత సంపన్నం కాబోతోందని ఆయన అన్నారు.

Exit mobile version