వనౌటులో రెండు శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. శనివారం ఉదయం 8:01 గంటలకు వనౌటు ద్వీపాన్ని 7.1 తీవ్రతతో భూకంపం తాకింది. అనంతరం 6.9 తీవ్రత రెండో భూకంపం హడలెత్తించింది. వనౌటు ఆస్ట్రేలియాకు తూర్పున సుమారు 1,750 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం ఏర్పడింది. వనౌటు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీపసమూహ దేశం.
జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం ప్రకారం.. శక్తివంతమైన భూకంపాలు వనౌటులోని అనేక ద్వీపాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. అదే ప్రాంతంలో సుమారు 25 సెకన్ల వ్యవధిలో 6.9 తీవ్రతతో మరో భూకంపం కూడా నమోదైందని వెల్లడించింది.
మొదటి భూకంప నివేదిక ప్రకారం.. భూకంప కేంద్రం వనౌటులోని సోలాకు పశ్చిమాన సుమారు 200 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. రెండవ నివేదిక ప్రకారం భూకంప కేంద్రం పోర్ట్-ఓల్రీకి పశ్చిమ-వాయువ్యంగా సుమారు 197 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. రెండు రీడింగ్‌లు కూడా దక్షిణ పసిఫిక్‌లోని ఒకే ప్రాంతంలో భూమికి దగ్గరగా భూకంప కార్యకలాపాలు జరుగుతున్నాయని సూచించాయి. వనౌటులో సంభవించిన బలమైన భూకంపాల తర్వాత ప్రాణనష్టం లేదా భవనాలకు జరిగిన నష్టంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. సునామీ పరిస్థితిపై స్పష్టమైన సమాచారం లేదు.

