Trump China Visit: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చారిత్రాత్మక చైనా పర్యటనను ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు. గత తొమ్మిదేళ్లలో ఒక అమెరికా అధ్యక్షుడు చైనా గడ్డపై అడుగుపెట్టడం ఇదే ఫస్ట్ టైం కావడంతో ప్రపంచం మొత్తం ఈ పర్యటనను ఆసక్తిగా గమనిస్తుంది. అయితే ట్రంప్ చైనా నుంచి అమెరికాకు తిరుగుపయనం అవుతున్న సమయంలో అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసిన ఒక షాకింగ్ సంఘటన జరిగింది. ఇంతకీ ఆ ఘటన ఏంటంటే..
డ్రాగన్ గూఢచర్యం అంటేనే వణుకు!
చైనా పర్యటన ముగిసిన వెంటనే అమెరికా భద్రతా సిబ్బంది తమ ప్రతినిధి బృందానికి చెందిన స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, అక్రిడిటేషన్ ఐడీ కార్డులతో పాటు వారు వాడిన అనేక వస్తువులను ఏకంగా చెత్తబుట్టలో పారేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా భద్రతా సంస్థలు ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక చైనా ‘సైబర్ గూఢచర్యం’పై ఉన్న భయమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. సైబర్ సెక్యూరిటీ పరంగా చైనాను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా అమెరికా పరిగణిస్తుంది. అమెరికా ప్రతినిధుల డేటాను దొంగిలించడానికి చైనా హ్యాకింగ్ లేదా మాల్వేర్ల ద్వారా నిఘా పెట్టే అవకాశం ఉందనే అనుమానంతోనే ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
‘ఫాక్స్ న్యూస్’ నివేదిక ప్రకారం.. ట్రంప్ బృందంలోని సభ్యులెవరూ తమ అసలు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను చైనాకు తీసుకెళ్లలేదు. వాటిని అమెరికాలోనే వదిలేసి, భద్రతా సంస్థలు అందించిన ప్రత్యేక “క్లీన్ డివైసెస్” (తాత్కాలిక ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు) మాత్రమే చైనాలో వాడారు. పర్యటన పూర్తవగానే వాటిని అక్కడే పారేయడం చేశారు. అయితే అమెరికా తీసుకున్న ఈ అత్యంత కఠినమైన సైబర్ జాగ్రత్తల వల్ల పర్యటనలో ఉన్న అధికారులకు మేనేజ్‌మెంట్ పరంగా పెద్ద తలనొప్పులు తెచ్చిపెట్టాయి. సాధారణంగా ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లు (WhatsApp, Signal వంటివి) లేదా సింక్ చేసిన డివైజ్‌ల ద్వారా సెకన్లలో పంపే సందేశాలను కూడా.. ఈ పర్యటనలో నేరుగా పంపడానికి వీల్లేకుండా చేశారు. ప్రతి చిన్న సమాచారాన్ని అత్యంత సురక్షితమైన ప్రత్యేక కమ్యూనికేషన్ మార్గాల ద్వారా, తాత్కాలిక అకౌంట్ల ద్వారా లేదా నేరుగా వ్యక్తిగతంగా కలిసి మాత్రమే అందజేయాల్సి వచ్చింది.
చారిత్రాత్మక ట్రంప్ చైనా పర్యటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2026 మే 13 – 15 తేదీలలో చైనా రాజధాని బీజింగ్‌లో అధికారికంగా పర్యటించారు. 2017 తర్వాత ఆయన చైనాకు రావడం ఇదే మొదటిసారి. ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న దౌత్య సంబంధాలను కాపాడుకోవడానికి ఈ పర్యటన అత్యంత కీలకమైనదిగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ట్రంప్ – చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ముఖాముఖి సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, సుంకాలు, తైవాన్ సంక్షోభం, ప్రస్తుతం నడుస్తున్న ఇరాన్ యుద్ధం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ప్రపంచ సవాళ్లపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. వాస్తవానికి ఈ పర్యటన మార్చిలోనే జరగాల్సి ఉండగా, మధ్యప్రాచ్యంలో ఇరాన్ సంక్షోభం తలెత్తడంతో దీనిని మే నెలకు వాయిదా వేశారు. ట్రంప్‌తో పాటు అగ్రశ్రేణి అమెరికన్ టెక్ సీఈఓలు, ముఖ్యంగా ఎలోన్ మస్క్ కూడా ఈ ప్రతినిధి బృందంలో చైనాలో పర్యటించడం గమనార్హం. ఇరు దేశాల అధినేతలు ప్రపంచ శాంతి గురించి ఒకవైపు మాట్లాడుకుంటున్నా.. అంతర్గతంగా అమెరికాకు చైనాపై ఎంతమాత్రం నమ్మకం లేదనే విషయాన్ని ఈ ‘ఫోన్లను చెత్తబుట్టలో పడేయడం’ ఘటన మరోసారి స్పష్టం చేసింది.
