US Man Jason Christmas Takes Uber To Rob Bank: బ్యాంకుల్లో దోపిడీ చేసేందుకు దొంగలు ఎన్నో నెలలు ప్లానింగ్ చేస్తారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు, ఒకటికి మించి పది వ్యూహాలు రచించుకుంటారు. లోనికి ఎలా వెళ్లాలి? డబ్బులతో బయటకు ఎలా రావాలి? పోలీసుల్ని ఎలా బురిడీ కొట్టించాలి?.. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే కసరత్తు చేసుకుంటారు. కానీ.. ఒక దొంగ మాత్రం ఇలాంటి ప్లానింగ్స్ ఏమీ లేకుండా, సినీ ఫక్కీలో చాలా దర్జాగా దొంగతనం చేశాడు. సింపుల్‌గా ఒక ఉబర్‌లో వచ్చాడు, బ్యాంక్‌ని దోచుకొని తిరిగి అదే కారులో ఇంటికి వెళ్లాడు. చివరికి డ్రైవర్ సైతం అతని దొంగతనాన్ని పసిగట్టలేనంత సింపుల్‌గా చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన అమెరికాలోని మిచిగాన్ సౌత్‌ఫీల్డ్‌లో చోటు చేసుకుంది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. జేసన్ క్రిస్ట్‌మస్(42) అనే వ్యక్తి తన ఇంటి నుంచి ఒక కార్ బుక్ చేసుకున్నాడు. బ్యాంక్‌లో చిన్న పని ఉందని చెప్పి, డ్రైవర్‌ను హంటింగ్‌టన్ బ్యాంకు వద్దకు తీసుకెళ్లాడు. తాను తిరిగొచ్చేదాకా వెయిట్ చేయమని చెప్పడంతో, డ్రైవర్ బయటే ఉన్నాడు. తాపీగా బ్యాంక్‌లోకి వెళ్లిన జేసన్.. ఒక్కసారిగా తుపాకీ బయటకు తీసి, అధికారుల్ని బెదిరించి, డబ్బు తీసుకున్నాడు. అనంతరం డబ్బు తీసుకొని హుందాగా కారెక్కి, తన ఇంటికి తీసుకెళ్లమని చెప్పాడు. దీంతో.. డ్రైవర్ జేసన్‌న తిరిగి తన ఫ్లాట్‌లో డ్రాప్ చేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే.. ఈ దోపిడీ గురించి తెలుసుకున్న పోలీసులు, రంగంలోకి దిగారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా.. ఆ చోరీకి పాల్పడింది జేసన్ అని తెలుసుకొని, అతని ఫ్లాట్‌కి వెళ్లారు. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. దొంగ దుస్తులపై ఎరుపు రంగు కనిపించడంతో, ఎవరైనా షూట్ చేశారా? అని పోలీసులు అడిగారు. అందుకు ఎవరూ చేయలేదని, అది కేవలం ఎరుపు రంగ మాత్రమేనని, ఆ రంగుని సైతం బ్యాంక్ నుంచే తీసుకొచ్చానని జేసన్ చెప్పాడు.
ఈ దోపిడీలో జేసన్‌కి ఉబర్ డ్రైవర్ కూడా సహకరించాడేమో అనుకొని, పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసేందుకు కూడా వెళ్లారు. అయితే.. తనకు ఈ దొంగతనం గురించి ఏమీ తెలియదని, తాను కేవలం పికప్ & డ్రాప్ మాత్రమేనని చేశానని అన్నాడు. అతనికి నిజంగానే ఈ దోపిడీతో సంబంధం లేదని నిర్ధారించుకున్నాక.. ఆ డ్రైవర్‌ని పోలీసులు వదిలిపెట్టారు. మరోసారి ఎవరైనా అనుమానంగా కనిపిస్తే.. వెంటనే సమాచారం అందించాలని సూచించారు. అటు.. ఈ తరహా దొంగతనాలు ఎప్పుడు జరగలేదని పోలీసులు తెలిపారు. అసలు ఈ దొంగతనం ఎందుకు చేశావని జేసన్‌ని ప్రశ్నించగా.. క్రిస్మస్ రాబోతోంది కాబట్టి, తన బంధువులకు & కుటుంబ సభ్యులు బహుమతులు ఇవ్డానికే ఈ దోపిడీకి పాల్పడ్డానని పేర్కొన్నాడు.
