Donald Trump: సొంత పార్టీ నుంచే ట్రంప్‌కు ఎదురుదెబ్బ! అమెరికా పార్లమెంట్‌లో సంచలనం.. ఏం జరిగిందంటే?

  • ఇరాన్ యుద్ధ అధికారాలపై అమెరికా పార్లమెంట్ చారిత్రాత్మక బ్రేక్
  • ట్రంప్‌కు షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు
Donald Trump San Francisco

Donald Trump San Francisco

Donald Trump: అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరికి, ఆయన ఇరాన్ విధానానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌లో సైనిక చర్యకు సంబంధించి అధ్యక్షుడి అధికారాలను పరిమితం చేసే కీలక తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల సభ (House of Representatives) తాజాగా ఆమోదించింది. ట్రంప్ సొంత రిపబ్లికన్ పార్టీకి చెందిన కొందరు చట్టసభ్యులు సైతం విపక్ష డెమోక్రాట్లతో చేతులు కలిపి ఈ తీర్మానానికి మద్దతు తెలపడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. హోరాహోరీగా సాగిన ఈ ఓటింగ్‌లో తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 208 ఓట్లు వచ్చాయి.

సొంత పార్టీ నుంచే తిరుగుబాటు
రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రముఖ ఎంపీలు థామస్ మాస్సీ, బ్రియాన్ ఫిట్జ్‌ప్యాట్రిక్, టామ్ బారెట్, వారెన్ డేవిడ్‌సన్ పార్టీ విప్‌ను ధిక్కరించి మరీ డెమోక్రాట్లతో కలిసి ఈ తీర్మానానికి ఓటేశారు. ఈ సందర్భంగా రిపబ్లికన్ ఎంపీ టామ్ బారెట్ మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక ఇబ్బందుల పట్ల తమ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని స్పష్టం చేశారు. మరో ఎంపీ థామస్ మాస్సీ మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడిపోతున్నారని, సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ యుద్ధంతో ప్రజలు, పార్లమెంటు రెండూ విసిగిపోయాయనడానికి ఈ ఓటింగే నిదర్శనమని చెప్పారు.

×
×
Ad

ట్రంప్ చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఆరోపణలు
యూఎస్‌లో ఉన్న ‘వార్ పవర్స్ యాక్ట్’ (యుద్ధ అధికారాల చట్టం) ప్రకారం.. యుద్ధం లాంటి పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు అధ్యక్షుడు తప్పనిసరిగా కాంగ్రెస్ (పార్లమెంట్) ఆమోదం పొందాలని ఎంపీ బ్రియాన్ ఫిట్జ్‌ప్యాట్రిక్ గుర్తుచేశారు. ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టిన న్యూయార్క్ డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు గ్రెగొరీ మీక్స్ మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ అధికారాలను పర్యవేక్షించడం కాంగ్రెస్ బాధ్యత అని, దీనికి రిపబ్లికన్ల మద్దతు లభించడం చారిత్రాత్మకమని కొనియాడారు.

‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’పై దర్యాప్తు షురూ..
చట్టం ప్రకారం కాంగ్రెస్ ఆమోదం లేకుండా విదేశాల్లో 60 రోజులకు మించి సైనిక చర్యలను కొనసాగించడానికి అధ్యక్షుడికి అధికారం లేదు. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌లో కొనసాగుతున్న అమెరికా సైనిక చర్య ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ (Operation Epic Fury) ఇప్పటికే 60 రోజుల గడువును దాటేసింది. దీనికి ట్రంప్ ప్రభుత్వం పార్లమెంట్ అనుమతి తీసుకోకపోవడంతో పెంటగాన్, అమెరికా విదేశాంగ శాఖ, యూఎస్‌ఏఐడీ (USAID) ఇన్‌స్పెక్టర్ జనరల్స్ ఈ ఇరాన్ యుద్ధంపై అధికారిక దర్యాప్తును షురూ చేశారు. అయితే హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ ఈ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిర్ణయం ట్రంప్ పరిపాలన సాగిస్తున్న శాంతి చర్చలను, దౌత్య ప్రయత్నాలను దెబ్బతీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌లో అమెరికా సైనిక లక్ష్యాలన్నీ ఇప్పటికే నెరవేరాయని, ట్రంప్ ఇప్పుడు శాంతి ఒప్పందం కోసమే కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతినిధుల సభ ఆమోదించిన ఈ కొత్త ప్రతిపాదనను ఇప్పుడు తదుపరి ఆమోదం కోసం సెనేట్‌కు పంపుతారు. అయితే ఇది నేరుగా అధ్యక్షుడి సంతకానికి వెళ్లదు కాబట్టి తక్షణమే చట్టంగా మారనప్పటికీ.. ఇటు కాంగ్రెస్, అటు దర్యాప్తు సంస్థలు, సొంత పార్టీ నేతల నుంచే ప్రశ్నలు ఎదురవుతుండటంతో ట్రంప్ ప్రభుత్వంపై రాజకీయ, చట్టపరమైన ఒత్తిడి తీవ్రం కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.