HIRE Act: సుంకాలతో భారత్‌ను ఇబ్బంది పెడుతున్న ట్రంప్ సర్కార్ మరో కొత్త చట్టానికి పదును పెడుతోంది. భారత ఐటీ రంగాన్ని ఈ చట్టం టార్గెట్ చేస్తుంది. దీంతో, అమెరికాలోనే క్లయింట్లకు సేవల్ని అందిస్తున్న భారతీయ ఐటీ సంస్థలు, ఉద్యోగులు తీవ్ర ప్రభావం ఎదుర్కొనే అవకాశం ఉంది. ఒహియోకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ బెర్నీ మోరెనో ప్రవేశపెట్టిన హాల్టింగ్ ఇంటర్నేషనల్ రిలొకేషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ (HIRE) చట్టం, ఆమోదం పొందితే అమెరికన్ కంపెనీలు విదేశీ కార్మికులనున నియమించుకునే ప్రక్రియను తీవ్రంగా దెబ్బతీస్తుంది.
HIRE చట్టం అంటే ఏమిటి?
హాల్టింగ్ ఇంటర్నేషనల్ రిలొకేషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ (HIRE) చట్టం, ముఖ్యంగా అమెరికన్లకు ప్రయోజనం చేకూరేలా రూపొందించింది. అమెరికన్ కంపెనీలు విదేశాలకు అవుట్‌సోర్స్ చేస్తున్న పనిని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. విదేశీ ఉద్యోగులకు చేసే చెల్లింపులపై 25 శాతం ఎక్సైజ్ పన్నును విధించాలని ఈ చట్టం ప్రతిపాదిస్తుంది. కంపెనీలు ఈ చెల్లింపులను ట్యాక్స్ డిడక్షన్ లో చూపించే హక్కును కోల్పోతారు. ఈ చట్టం ద్వారా వసూలయ్యే ఆదాయాన్ని ‘‘డొమెస్టిక్ వర్క్ ఫోర్స్ ఫండ్’’ అనే ఫండ్‌కు తరలించి, అమెరికన్ ఉద్యోగులకు శిక్షణ, అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్‌ల కోసం వినియోగిచనున్నట్లు చట్టంలో ప్రతిపాదన ఉంది.
భారత ఐటీ రంగానికి పెను సవాల్:
283 బిలియన్ డాలర్ల విలువ కలిగిన భారత ఐటీ పరిశ్రమ, అనేక అమెరికన్ కంపెనీలకు అవుట్‌సోర్సింగ్ సేవల్ని అందిస్తోంది. ఇందులో ఆపిల్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, సిస్కో, సిటిగ్రూప్, ఫెడ్ఎక్స్, హోం డిపోట్ వంటి వంటి సంస్థలు ఉన్నాయి. అయితే, ఈ చట్టం ఇప్పట్లో పూర్తిస్థాయిలో ఆమోదం పొందే అవకాశం తక్కువే. కానీ దీని ప్రభావం కొంతకాలంగా ఉన్న అమెరికన్ కంపెనీల అవుట్ సోర్సింగ్ విధానాలను మారుస్తుంది. ఇప్పటికే క్లయింట్లు కొన్ని ఒప్పందాలను ఆలస్యం చేస్తున్నారని లేదా తిరిగి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
భారత ఐటీ కంపెనీలపై ఆర్థిక ప్రభావం:
ప్రతిపాదిత చట్టం విదేశీ ఐటీ సేవలపై ఆధారపడే ఐటీ కంపెనీలపై ఖర్చుల్ని పెంచతుంది. HIRE చట్టం అంతర్జాతీయ సేవా ఒప్పందాలపై పన్ను భారాన్ని పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిపుణులు అంచనా వేస్తున్నదాని ప్రకారం.. ఫెడరల్, స్టేట్, లోకల్ పన్నులను కలిపితే కొన్నిసార్లు అవుట్‌సోర్సింగ్‌కు 60 శాతం వరకు పన్ను భారం పడొచ్చు. అయితే, కంపెనీలు దీనిని వ్యతిరేకిస్తూ ప్రభుత్వంతో లాబీయింగ్ చేయడమో, కోర్టులో ఈ చట్టాన్ని ఛాలెంజ్ చేయడమో చేసే అవకాశం ఉంది.
అవుట్ సోర్సింగ్‌తో పాటు, ఈ బిల్లు యూఎస్ గ్లోబల్ కాపబిలిటీ (GCC)లను ప్రభావితం చేస్తుంది. అమెరికన్ కంపెనీలు భారత్‌లో ఏర్పాటు కేసిన ఈ కేంద్రాలు, హై వాల్యూ ఆపరేషన్లు( ఆపరేషన్, ఆర్థిక వ్యవహరాలు, ఆర్ అండ్ డీ, ఇన్నొవేషన్)నున నిర్వహిస్తున్నాయి. విదేశీ టాలెంట్‌ను నియమించుకోవడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది అయితే, ఈ కేంద్రాలపై పెట్టే పెట్టుబడులు, ప్రాధాన్యతలు మారే అవకాశం ఉంటుంది.
