డెల్టా వేరియంట్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో పరిస్థితి మళ్లీ చేజారుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడ ఒక్క రోజే లక్షకు పైగా కేసులు రావడం కలకలం రేపింది. జూన్‌లో అత్యంత తక్కువగా నమోదైన కేసులు.. ఇప్పుడు మళ్లీ పీక్‌కి చేరుకోవడంతో అగ్రరాజ్యం అప్రమత్తమైంది. ఒక శుక్రవారం రోజే లక్షా 30 వేలకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. జూన్ నెల చివరిలో రోజువారీ కేసులు 11 వేలకు పడిపోయాయి. కానీ, ఈనెల 3 నుంచి రోజూ లక్షకు పైగా నమోదవుతున్నాయి. జూన్ నెలతో పాటు జులై మొదటి వారంలోనూ కేసుల సంఖ్య 20 వేల లోపే ఉన్నాయి. ఇది ఇప్పుడు మరింత పెరుగుతూ పోతున్నాయి.
గత ఏడాది కరోనా మొదటి వేవ్‌లో రోజువారీ కేసుల సంఖ్య లక్ష దాటడానికి 9 నెలలు పట్టగా ఇప్పుడు 6 వారాల్లోనే ఆ సంఖ్యను దాటేయడం అక్కడ మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య, మరణాలు కూడా పెరుగుతున్నాయి. రెండు వారాల క్రితం రోజుకి 270 మంది చనిపోగా.. ఆ సంఖ్య 700 దాటింది. అమెరికాలో టీకా తీసుకోని వారిలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ప్రత్యేకంగా దక్షిణ ప్రాంతంలో ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. మరింత మంది అమెరికన్లు టీకాలు తీసుకోకపోతే కేసుల పెరుగుదల ఇంకా తీవ్రంగా ఉండొచ్చని ఆరోగ్య అధికారులే భయపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో 41 శాతం ఫ్లోరిడా, జార్జియా, అలబామా, మిసిసిపీ, కరోలినా, కెంటకీల్లోనే ఉంటున్నారు. ఇక, అమెరికాను మాత్రమే కాదు.. చైనాను కూడా మళ్లీ కరోనా వణికిస్తోంది. తొలిసారి వైరస్ బయటపడిన వుహాన్ నగరంలో కోటీ 12 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు అధికారులు తెలిపారు. శ్రీలంకలో కరోనా డెల్టా రకం వ్యాప్తి తీవ్రంగా ఉంది. అక్కడ కొవిడ్‌తో చనిపోయినవారి సంఖ్య 5 వేలకు చేరింది.
