NTV Telugu Site icon

Ukraine-Russia: భర్తను అలా ప్రేరేపించినందుకు రష్యన్ మహిళకు జైలుశిక్ష

Russia

Russia

ఆడదానికి ఆడదే శత్రువు అంటుంటారు. ఏ ఉద్దేశంతో ఈ సామెత ఎందుకు పుట్టుకొచ్చిందో తెలియదు గానీ.. రష్యాలో ఒక మహిళ వ్యవహరించిన తీరుకు ఈ సామెత అచ్చు గుద్దినట్లుగా సరిపోతుంది. ఆపదలో ఉన్న మహిళల పట్ల జాలి పడాల్సిన సాటి మహిళ.. క్రూరత్వాన్ని ప్రదర్శించింది.

2022, ఏప్రిల్ నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. రష్యా సైన్యం.. ఉక్రెయిన్‌పై తీవ్రస్థాయిలో వైమానిక దాడులతో విరుచుకుపడింది. వందలాది భవంతలు నేలమట్టం అయ్యాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇలా రెండు దేశాల మధ్య భీకరమైన యుద్ధం సాగుతున్న వేళ.. రష్యన్‌కు చెందిన ఓల్గా బైకోవ్స్కయా అనే మహిళ.. సైన్యంలో ఉన్న తన భర్తతో ఫోన్‌లో సంభాషిస్తూ ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారం చేయాలంటూ పురికొల్పింది.

వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను ఉక్రెయిన్ సైన్యం సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ సమయంలో తెగ వైరల్ అయింది. అనంతరం ఆ జంటను జర్నలిస్టులు గుర్తించారు. రోమన్ బైకోవ్స్కయా-ఓల్గా బైకోవ్స్కయాగా గుర్తించారు. వీరిద్దరూ రష్యాలోని ఫియోడోసియాలో నివసిస్తు్న్నట్లు ఆధారాలు లభించాయి. ఇక యుద్ధ చట్టాలు ఉల్లంఘన కింద రష్యన్ మహిళకు ఉక్రెయిన్ నోటీసు పంపించింది. అంతేకాకుండా అంతర్జాతీయ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఇక ఉక్రెయిన్ చట్ట ప్రకారం అధికారులు దర్యాప్తు పూర్తి చేశారు. 2022, డిసెంబర్‌లోనే ఆమెపై కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు.

ఇక తాజాగా ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారానికి ప్రేరేపించినందుకు రష్యన్ పౌరురాలు ఓల్గాను కైవ్‌లోని షెవ్‌చెంకివ్స్కీ జిల్లా కోర్టు దోషిగా తేల్చి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఈ మేరకు రేడియో లిబర్టీ వార్తాపత్రిక పేర్కొంది. అయితే ఆమె న్యాయస్థానం ముందు హాజరుకాలేదు.