Site icon NTV Telugu

War: ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ముహూర్తం కుదిరిందా..?

ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభం మరింత ముదిరింది. ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదనిపిస్తోంది. ఇప్పటికే విదేశీ పౌరులు, సిబ్బంది చాలా వరకు ఆ దేశాన్ని వీడారు. అమెరికా రాయబార కార్యాలయం ఖాళీ అయింది. ఇది పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఖాయమనే అంటున్నారు. అదే జరిగితే పర్యవసనాలు ఎలా ఉంటాయన్నది ప్రశ్న. రష్యా చర్యతో యూరప్‌ యుద్ధ రంగంగా మారే ప్రమాదం ఉంది. ఒకవేళ రష్యా దాడి చేయకపోయినా సమీప భవిష్యత్‌లో ఈ ఉద్రిక్తతలు ఆగవు. తూర్పు, పశ్చిమ ఐరోపా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. యూరప్‌లో తీవ్ర అస్థిరతకు దారితీస్తుంది. అంతేగాక, పలు ప్రపంచ దేశాలపై కూడా దీని ప్రభావం పడుతుంది.

ఏదేమైనా మరో వారం, పది రోజులలో ఈ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం దొరికేది లేనిది తేలిపోతుంది. యుద్దం అంటూ మొదలైతే అది ఎక్కడి వరకు వెళుతుందో తెలియదు. బుధవారం తరువాత ఏ క్షణంలో అయినా ఉక్రెయిన్‌ను రష్యా కబళించవచ్చని అమెరికా అంటోంది. బైడెన్‌ సర్కార్‌ ఆదేశాల మేరకు ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లోని దాదాపు అన్ని రాయబార కార్యాలయాలు ఖాళీ అయ్యాయి.

Read: Mahindra: గుడ్‌న్యూస్… ఆ మోడ‌ళ్ల‌పై భారీ డిస్కౌంట్‌…

బైడెన్‌, పుతిన్ మధ్య శనివారం జరిగిన ఫోన్‌ సంభాషణతో ఎలాంటి ఫలితం చూపలేదు. దాంతో, అమెరికా తాజా హెచ్చరికలు, దాని దౌత్యపరమైన కదలికలు చూస్తుంటే ఉక్రెయిన్ భవిష్యత్తుకు ఇది పరీక్షా సమయయని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
యురప్‌ భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపనున్న ఈ సంక్షోభాన్ని అమెరికా, రష్యా తమ స్వీయప్రయోజనాకోసం ప్రమాద స్థితికి తీసుకు వెళ్లాయి. కాబట్టి వీరి మధ్య పంచాయితీ వల్ల సంక్షోభం ఊహించని మలుపులు తిరుగవచ్చని అంటున్నారు.

మరోవైపు, దాడి చేసే ఉద్దేశం లేదంటూనే ఉక్రెయిన్ చుట్టూ భారీగా సైనిక బలగాలను మోహరించింది. క్రిమియా, బెలారస్, పశ్చిమ రష్యాలో కొత్తగా పెద్ద ఎత్తున మిలిటరీ బలగాలను మోహరించినట్టు తెలుస్తోంది. భారీ ఎత్తున యుద్ధ సామాగ్రి తరలిస్తోంది. యుద్ధ సన్నాహాలలో భాగంగా దాదాపు లక్షా యాబై వేల మంది సైనికులు సరిహద్దుల్లో మోహరించి ఉన్నారు. ఏ క్షణంలోనైనా దాడి జరగవచ్చని కథనాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాలు యురోపియన్‌ యూనియన్‌ దేశాల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఉక్రెయిన్‌-రష్యా పంచాయితీ వెనక పెద్ద కథ ఉంది. నిజానికి, సోవియట్‌ కాలం నుంచే ఇరు దేశాల మధ్య గొడవలు ఉన్నాయి. అప్పట్లోనే ఉక్రెయిన్‌ స్వాతంత్ర్యం కోసం పలుమార్లు ప్రయత్నించింది. దాని చారిత్రక నేపథ్యాన్ని అమెరికా తనకు అనుకూలంగా మలుచుకుంది. సోవియట్‌ విచ్ఛిన్నం తరువాత రెండేళ్లకే దానిపై నాటో ఫోకస్‌ పెట్టింది. ఉక్రెయిన్‌తో అది సంబంధాలు పెంచుకోవటం రష్యా ఆందోళనకు కారణమైంది.

2008లో నాటి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు యష్చంకో, ప్రధాని యూలియా టిమోషెంకోఉక్రెయిన్‌ నాటోలో చేరేందుకు రంగం సిద్ధం చేశారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్‌ కూడా అందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. దాంతో ఆగ్రహించిన పుతిన్‌ ఉక్రెయిన్‌కు గ్యాస్‌ సరఫరా ఆపేశాడు. తూర్పు, మధ్య ఐరోపా దేశాలకు కూడా గ్యాస్ ఈ పైపులైన్‌ నుంచే వెళుతుంది. ఫలితంగా, ఉక్రెయిన్‌పై అంతర్జాతీయ ఒత్తిళ్లు పెరిగి నాటోలో చేరాలన్న దాని ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది. అనంతరం ఉక్రెయిన్‌ విషయంలో రష్యా మరింత అప్రమత్తమైంది.

Read: AP Covid 19: నైట్‌ కర్ఫ్యూపై కీలక నిర్ణయం

2010లో జరిగిన ఉక్రెయిన్‌ అధ్యక్ష ఎన్నికల్లో రష్యా అనుకూల అభ్యర్థి విక్టర్‌ యాన్కోవిచ్‌ విజయం సాధించాడు. ఉక్రెయిన్‌ నాటోకు దూరంగా ఉంటుందని ప్రకటించాడు. దాంతో ఉక్రెయిన్‌ లో అమెరికా మళ్లీ ఆట మొదలు పెట్టింది. ఇదే సమయంలో మాజీ ప్రధాని యూలియా టిమోషెంకోను ఆవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లారు. ఇది ఉక్రెయిన్‌ ప్రతిపక్ష నేతల్లో తీవ్ర ఆందోళన రేపింది. దాంతో, అమెరికా అండతో ప్రజలను రెచ్చగొట్టి దేశంలో మళ్లీ కల్లోలానికి తెరలేపారు. పెద్ద ఎత్తున జరిగిన ఘర్షణల్లో ఎంతో మంది చనిపోయారు. చివరకు యాన్కోవిచ్‌ గద్దె దిగాల్సి వచ్చింది. తరువాత అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పడింది. దీనిని రష్యా గుర్తించ లేదు. పైగా, ఉక్రెయిన్‌ విషయంలో దూకుడు పెంచి క్రిమియాను స్వాధీనం చేసుకుంది. తరువాత ఉక్రెయిన్‌ డాన్‌బాసోలో హింసకు తెరలేపింది. ఆ హింస ఇంకా కొనసాగుతూనే ఉంది.

గత ఏడాది లక్షకు పైగా రష్యా సైనికులు ఉక్రెయిన్ సరిహద్దులలో మోహరించటంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా పెరిగాయి. దాంతో నాటోలో చేరేందుకు ఉక్రెయిన్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనికి కౌంటర్‌ గా ఉక్రెయిన్‌ సరిహద్దులలో రష్యా యుద్ధ సన్నాహాలు మొదలు పెట్టింది. సహజంగానే రష్యాపై అమెరికా, యురోపియన్‌ యూనియన్‌ బెధిరింపుల పర్వం మొదలైంది. ఆర్థిక ఆంక్షలంటూ బెధిరించారు. ఐనా, పుతిన్‌ వెనక్కి తగ్గలేదు. ఉక్రెయిన్‌ నాటోలో చేరదని రాతపూర్వక హామీ ఇస్తే తప్ప సంక్షోభానికి తెరపడదని తేల్చేశాడు. అంతే కాదు అల్బేనియా,బోస్నియా,హెర్జెగోవినా, బల్గేరియా, క్రోయేషియా,గ్రీస్‌ కొసావో,మాంటెనీర్గో, నార్త్‌ మాసిడోనియా, రొమేనియా, సెర్బియా, స్లొవేనియా, రొమేనియాల నుంచి నాటో దళాలను వెనక్కి తీసుకోవాలని పుతిన్‌ డిమాండ్‌ చేస్తున్నాడు. ఈ డిమాండ్‌కు వారు ఒప్పుకుంటారని అనుకోలేము. అలాగే, ఇంత దూరం వచ్చాక పుతిన్‌ వెనకకు వెళ్లే పరిస్థితి లేదు. కనుక, ఎటు చూసినా ఉక్రెయిన్‌పై రష్యా దాడి తప్పేలా లేదు!!

Exit mobile version