UK: యునైటెడ్ కింగ్‌డమ్(UK)లోని నార్త్ యార్క్‌షైర్‌లోని హారోగేట్‌లో ఉన్న ఆర్మీ ఫౌండేషన్ కాలేజ్(AFC)లో మహిళలపై అత్యాచార, లైంగిక వేధింపుల ఘటనలు ఆ దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఈ కాలేజీలో చదువుకున్న కనీసం నలుగురు మహిళలు, తమకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సామూహిక అత్యాచారం, లైంగిక వేధింపులు, రహస్యంగా చూడటం వంటి ఘటనలకు గురయ్యామని బీబీసీకి తెలిపారు. సిబ్బంది ప్రోత్సాహంతో స్త్రీ ద్వేషం, లైంగిక హింసకు పాల్పడినట్లు వెల్లడించారు.
AFC అనేది యూకేలో 19 ఏళ్లలోపు వారి కోసం ఉన్న అతిపెద్ద సైనిక శిక్షణా సంస్థ. ఈ యుద్ధ పాఠశాల సైన్యంలోని 16 ఏళ్ల రిక్రూట్‌లందరినీ చేర్చుకుంటుంది. ప్రస్తుతం దీనిలో మొత్తం 889 మంది రిక్రూట్‌లలో కనీసం 70 మంది మహిళా జూనియర్ సైనికులు ఉన్నారు. తాజాగా వచ్చని ఈ కథనాలు బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న మహిళలపై లైంగిక వేధింపుల ఘటనల్ని తెర పైకి తెచ్చాయి. గత ఏడాదిలో AFCకు సంబంధించి 16 లైంగిక నేరాల ఫిర్యాదులు నార్త్ యార్క్‌షైర్ పోలీసులకు అందాయి. వాటిలో లైంగిక వేధింపులు, లైంగిక దాడి ఆరోపణలు ఉన్నాయి. యూకే రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) గణాంకాల ప్రకారం, 2018 జనవరి నుంచి 2025 జూన్ వరకు మొత్తం 176 లైంగిక దుర్వ్యవహార ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిలో 32 ఫిర్యాదులు శాశ్వత సిబ్బందిపై, 144 ఫిర్యాదులు జూనియర్ సైనికులపై నమోదయ్యాయి.
తనపై జరిగిన అకృత్యాలను ఒక మహిళ వెల్లడించింది. చిన్నప్పటి నుంచి సైనికురాలు కావాలని కలలుగన్నానని, అయితే అకాడమీలో తోటి సైనికులు చాలా మంది తనపై కొన్ని గంటల పాటు అత్యాచారం చేయడంతో తన కలలు చెరిగిపోయాయని చెప్పింది. ఈ సంఘటన సమయంలో తనకు 17 ఏళ్లు ఉన్నాయని, వారు నా బట్టలు విప్పి, నా శరీర భాగాలను తాకరని, ఆ తర్వాత నాపై అత్యాచారం జరిగిందని, నా వయసు ఉన్న పలువురు జూనియర్ సైనికులు గంటల పాటు హింసిచారని, తనను ఒక మాంసం ముక్కలా చూవారని చెప్పింది. ఈ దాడి జరిగిన కొన్ని రోజులకే ఆమె సైన్యం నుంచి వైదొలిగింది.
బాధితులు చెబుతున్న దాని ప్రకారం.. కొందరు శిక్షకులే మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడేవారని చెప్పారు. ఈ ఆరోపణల్ని బ్రిటిష్ ఆర్మీ తీవ్రంగా పరిగణించింది. లైంగిక హింస, వేధింపులకు సాయుధ దళాల్లో స్థానం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలకు గురైనవారు తమ ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఆర్మీ పిలుపునిచ్చింది. బాధితులకు న్యాయపరమైన సహాయం అందించేందుకు ప్రత్యేక వ్యవస్థల్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.

